జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న మర్రిపాలెం టోల్‌ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 79 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలు, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్ట్‌ చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సబ్బవరం సీఐ జి. రామచంద్రరావుతో కలిసి శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్‌. సుదర్శన్‌, అబీబీ ఖాన్‌, హుస్సేన్‌ ఖాన్‌.. విశాఖ చేరుకుని, అప్పటికే విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లఖన్‌ బేరాగి, కమల్‌ ప్రజాపత్‌లతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ జిల్లా కుల్బాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కులాన్‌, కలియా అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, రెండు వాహనాల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో సబ్బవరం పోలీసులకు అందిన సమాచారంతో సీఐ జి. రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు మర్రిపాలెం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు గోనె సంచుల్లో ఉన్న 79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక టెంపో, ఒక కారును సీజ్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.95 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.7.75 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సింహాచలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఐదుగురు అరెస్టు

Advertisement
 
Advertisement
Advertisement