చింతపల్లి: గిరిజన రైతాంగం వచ్చే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను వినియోగించడం అత్యంత కీలకమని స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల రైతులతో విత్తన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు 80 శాతానికి పైగా మొలక శాతం కలిగిన విత్తనాలను మాత్రమే సాగుకు వినియోగించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అధిక ఖర్చుతో కూడిన హైబ్రిడ్ రకాల కంటే.. మధ్యకాలిక, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.
స్థానిక సంప్రదాయ రకాలతో అదనపు ఆదాయం
మైసూర్ మల్లిక వంటి స్థానిక భూమాతృక విత్తన రకాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా డాక్టర్ అప్పలస్వామి వివరించారు. ఈ రకాలను వాడటం వల్ల జన్యు వనరుల పరిరక్షణతో పాటు, నాణ్యమైన విత్తనోత్పత్తి, విలువ ఆధారిత మార్కెటింగ్ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మాజీ వ్యవసాయ పరిశోధనా స్థానం సలహా మండలి సభ్యుడు పి.దేముడు మాట్లాడుతూ.. ఉన్నత శ్రేణి పర్వత ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికంగా వరి, రాగితో పాటు సంప్రదాయ పంట రకాలను పరిరక్షిస్తూ, మైదాన ప్రాంతాల్లో సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ధ్రువీకరించిన విత్తనాలే వాడాలి
వ్యవసాయ శాఖ ద్వారా ధ్రువీకరించిన విత్తనాలను వాడటం వల్ల మెరుగైన మొలక, ఏకరీతి పంట పెరుగుదల మరియు అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని సీనియర్ శాస్త్రవేత్త కె.బయ్యపురెడ్డి వివరించారు. రైతులకు బీజామృతం తయారీ, విత్తన శుద్ధి, సహజ వ్యవసాయంలో దాని ప్రాముఖ్యతను శాస్త్రవేత్త సందీప్ నాయక్ వివరించారు. బీజామృతం వినియోగం ద్వారా మొలక శాతం మెరుగుపడి, వేర్ల అభివృద్ధి చెందడమే కాకుండా మొక్కల ప్రారంభ పెరుగుదల బలంగా ఉంటుందన్నారు. మండల వ్యవసాయాఽ దికారి మధుసూదన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, పరిశోధనా స్థానం సంయుక్తంగా సూచించే శాసీ్త్రయ సాగు పద్ధతులను రైతులు విధిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఉమామహేష్, జోగారావు, బాలహుస్సేన్‌రెడ్డి, వెంకటేష్, టాటా ట్రస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అప్పలరాజు తదితరులు రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం రైతులకు పంటల సాగు సాంకేతికతలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ఎసరాడ, ఏబులం, దుచ్చరపాలెం గ్రామ రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు.


