ముంచంగిపుట్టు: సులభమైన పద్ధతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి సీడ్ బాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గిరిజన రైతులకు, ప్లాంటేషన్ మేసీ్త్రలకు సీడ్ బాల్స్ తయారీపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు పేడ, కట్టె పొయ్యి బూడిద, సేంద్రియ ఎర్రమట్టి, జీవామృత ద్రావణాలను ఉపయోగించి రైతుల చేత స్వయంగా సీడ్ బాల్స్‌ను తయారు చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ పద్ధతి ద్వారా స్థానిక అటవీ విత్తనాలను నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాఫ్రా, నల్లమద్ది, తెల్లమద్ది, చింత, అడ్డ, నేరేడు వంటి వృక్ష జాతుల విత్తనాలను సీడ్ బాల్స్‌గా మార్చి భూముల్లో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పద్ధతి వల్ల విత్తనాలను పక్షులు, కీటకాల బారి నుంచి రక్షించవచ్చన్నారు. ఎటువంటి ప్రత్యేక సంరక్షణ, నీటి సదుపాయం లేకపోయినా.. వర్షం పడగానే ఇవి మొలకెత్తి ఏపుగా వృక్షాలుగా పెరుగుతాయన్నారు. అందువల్ల గిరిజన రైతులంతా ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అనంతరం పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీహెచ్.నారాయణపడాల్, ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటరాజు, శ్రీను, స్థానిక గిరిజన నాయకులు, రైతులు, ప్లాంటేషన్ మేస్త్రిలు పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ


