పాడేరు అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల ముందు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, వాటిని అమలు చేయకుండా పేద ప్రజలను వంచించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాడేరు పురవీధులు హోరెత్తాయి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం, సూపర్ సిక్స్ హామీల కరపత్రాలు, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన బాండ్లను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించారు. చంద్రబాబుది వంచన పాలన సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నో ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తీరా పీఠం ఎక్కాక ప్రజలకు వంచన పాలన అందించడం దారుణమని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ.. వంటి అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
కూటమి పాలనలో నరకం:
మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అమలుకాని హామీలను ఇచ్చి సీఎం చంద్రబాబు ప్రజలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను పక్కనబెట్టి చంద్రబాబు నిరంకుశంగా పాలిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, ఎంపీటీసీ లకే రామకృష్ణపాత్రుడు, మాజీ పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి లకే రామసత్యవతి, యువజన విభాగం అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, మాజీ సర్పంచ్‌లు, సీనియర్ నాయకులు వంతాల రాంబాబు, లక్ష్మణరావు, బొంజుబాబు, నాగరాజు, కన్నాపాత్రుడు, కోటిబాబునాయుడు, గంగరాజు, సుదర్శన్, నరేష్, రాజేష్ పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో వంచన
రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
కూటమి పాలనకు వ్యతిరేకంగా నిరసన
హోరెత్తిన నినాదాలు
మేనిఫెస్టో ప్రతుల దహనం
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు విశేష స్పందన


