నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం 4.30 గంటల వరకు భానుడి ఉగ్రరూపం చూపించగా, ఆ తర్వాత 5 గంటలకు ఉన్నపళంగా వరుణుడు గాలివాన రూపంలో విరుచుకుపడ్డాడు. పెదబొడ్డేపల్లి రామాలయం ఆవరణలో భారీ వృక్షం నేల కూలింది. పెదబొడ్డేపల్లి, సుబ్బరాయుడుపాలెం వద్ద చెట్లు కూలగా, నాలుగు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ వెళ్లే మెయిన్‌రోడ్డుపై చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెరుపులు, ఉరుములకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ గపూర్, ఎస్సై రమేష్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మెయిన్ రోడ్డుపై పడిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగింపజేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సిబ్బంది సత్వరమే సరఫరా పునరుద్ధణకు చర్యలు చేపట్టారు. వర్షం కంటే బలమైన గాలులు వీయడంతో చెట్లు నేల కూలాయి.


