రోడ్డు విస్తరణలో నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణలో నిబంధనలకు పాతర

Jun 5 2026 12:12 AM | Updated on Jun 5 2026 12:12 AM

● కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● సక్రమంగా జరగని మట్టి తొలగింపు

మాకవరపాలెం: రోడ్డు విస్తరణ పనుల్లో నిబంధనలు పాటించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలోని రాచపల్లి జంక్షన్‌ నుంచి కోటవురట్ల మండలం చౌడువాడ వరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణంతోపాటు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 అడుగులు వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును రెండు వైపులా 3 అడుగుల చొప్పున విస్తరించి 18 అడుగులకు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా చౌడువాడ సమీపం నుంచి రోడ్డుకు ఒకవైపు చేపట్టిన మూడడుగులు విస్తరణ పనులు గురువారం నాటికి జి.కోడూరు గ్రామం వరకు చేరుకున్నాయి.

కిందన రెండు అడుగలే...

ప్రస్తుతం మూడడుగుల విస్తరణలో భాగంగా మట్టిని తొలగించి మెటల్‌ వేసుకుంటూ వస్తున్నారు. ఈ మూడడుగుల వెడల్పుతో మీద నుంచి కింద వరకు మట్టిని తొలగించాలి. కానీ కిందకు వెళ్లే సరికి రెండు అడుగులే ఉంటుంది. ఇక లోతు అడుగున్నర మేర మట్టిని తొలగిస్తున్నారు. మూడడుగుల వెడల్పున తీయాల్సిన మట్టిని కిందకు వెళ్లేసరికి రెండడుగులే తీయడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టానుసారంగా చేసుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటివరకు ఆర్‌అండ్‌బీ ఏఈగా పనిచేసిన నారాయణరెడ్డిని సంప్రదించగా తాను డీఈ పదోన్నతిపై బదిలీ అయినట్టు తెలిపారు. మూడడుగులు కచ్చితంగా మట్టిని తొలగించాల్సిందేనన్నారు. తన స్థానంలో నర్సీపట్నం ఏఈ నాయుడుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement