కె.కోటపాడు: నిర్ణీత సమయానికల్లా ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని అనకాపల్లి జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి బి.వి.సత్యనారాయణ తెలిపారు. కె.కోటపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కార్యాలయ పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మూమెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. వివిధ సేవల పట్ల ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలు చేయనున్న దృష్ట్యా ఇప్పటికే వెల్ఫేర్ అసిస్టెంట్లకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలను శుక్రవారంలోగా నమోదు చేయాలని తెలిపారు. 0–6 ఏళ్ల వయస్సు విద్యార్థుల ఆధార్ వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు అక్షరాంధ్ర రెండో విడత కార్యక్రమం వెలుగు సిబ్బందితో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో ఇంకా మిగలిన సిటిజన్ ఈకేవైసీని పూర్తి చేయడంతోపాటు వాట్సాప్ గవర్నన్స్–మన మిత్ర యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా 540పైగా సేవలను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్.జి.ఎస్.డబ్ల్యూ మండల అధికారి సౌజన్య, కె.కోటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.శ్రీను సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


