నర్సీపట్నం: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను గురువారం నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాలు.. డీఎస్పీ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్సై రాజారావు, సిబ్బంది గబ్బాడ సమీపంలో మాటు వేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, 26 కిలోల గంజాయి లభ్యమైంది. పాత నేరస్తుడైన విశాఖ నగరంలోని అల్లిపురానికి చెందిన బోధ శ్రీను(40), గంజాయి రవాణాకు సహకరించిన చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన బిరుబోజు రమణమూర్తి(29), తిమురు గణేష్ కుమార్(26)లను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు ప్రేరేపించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశాలోని చిత్రకొండ వద్ద కొనుగోలు చేసి విశాఖపట్నం తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు శ్రీను గంజాయి పొట్లాలు కట్టి ఒక్కొక్కటి రూ.200కు అల్లిపురం, ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో విక్రయిస్తాడని తెలిపారు. మత్తు చాకెట్లు కూడా విక్రయిస్తాడన్నారు. ఇతనిపై విశాఖపట్నంలో నాలుగు కేసులు ఉన్నాయన్నా రు. పట్టుబడిన గంజాయి, స్వాధీనం చేసుకున్న కారు విలువ రూ.23 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.


