సిటీ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సిటీ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష

Jun 5 2026 12:12 AM | Updated on Jun 5 2026 12:12 AM

డాబాగార్డెన్స్‌: సిటీ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధే ధ్యేయంగా నగర పరిధిలోని పలు ప్రాజెక్టులపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధి అభిజిత్‌రేతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద చేపట్టిన ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల వివరాలను వారికి వివరించారు. విశాఖ ఎకనామిక్‌ రీజన్‌ అభివృద్ధిలో భాగంగా నగర భౌగోళిక పరిస్థితులు, అవసరాలపై వరల్డ్‌బ్యాంక్‌ ప్రతినిధుల బృందానికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కమిషనర్‌ సమగ్రంగా వివరించారు. నగరంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల విస్తరణ, మొబిలిటీ కారిడార్స్‌, రోడ్డు కనెక్టివిటీ పెంపుదల, హౌసింగ్‌, మురికివాడల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పనపై ఈ ప్రజంటేషన్‌లో చర్చించారు. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధుల బృందం నగరంలోని పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించనుందని కమిషనర్‌ తెలిపారు. సమీక్షా సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌. వర్మ, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు, అడ్వైజర్‌ కేవీఎన్‌ రవి, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మేనేజర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement