రెండేళ్ల పాలన
జిల్లా వ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
● ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం
● ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులు
● సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు
● డీఎస్సీలో అక్రమాలతో విద్యావంతులతో చెలగాటం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపాటు
● వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
● ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు విశేష స్పందన
జి.మాడుగుల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, గురువారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా నెరవేర్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద రూ.15వేలు, రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పి ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.1,500 ఇస్తామన్న హామీలను అటకెక్కించారని, పెన్షన్ల ఎత్తివేత, డీఎస్సీ అక్రమాలతో విద్యావంతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. జగన్ అందించిన సంక్షేమాన్ని మించి పథకాలు ఇస్తామని ఊకదంప్పుడు ప్రసంగాలు చేసి, ఈ రెండేళ్లలో ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పోలీసుల అడ్డగింతపై ఎమ్మెల్యే ఆగ్రహం
నిరసనలో భాగంగా కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో, బాండ్ ప్రతులను దహనం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రయత్నించగా.. సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలోని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేనిఫెస్టో ప్రతులను చించి గాలిలోకి ఎగురవేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో జి.మాడుగుల జంక్షన్ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండంనాయుడు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారామరాజు, వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ తెడబరికి సురేష్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఎంపీటీసీలు మత్స్యరాస విజయకుమారి, గబ్బాడి సన్యాసిదొర, పాంగి లక్ష్మి, చిన్నారావు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం సంయుక్త కార్యదర్శి అంద్రయ్య, తాజామాజీ సర్పంచ్‌లు ఐసర హనుమంతరావు, రామకృష్ణ, సీదరి కొండబాబు, లసంగి మాలన్న, పెద్దబాలన్న, వైఎస్సార్‌సీపీ నేతలు పాంగి చిట్టిబాబు, వలసయ్య, మన్మథరావు, సోమలింగం, మత్స్యకొండబాబు, ఈశ్వరరావు, బాలయ్యపడాల్, శ్రీనివాసనాయుడు, కూర్మరాజు, సోంబాబు, కొండబాబు, వివిధ అనుబంధ విభాగాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాడేరు ఆర్డీవోగా భుజంగరావు
సాక్షి,పాడేరు: పాడేరు ఆర్డీవోగా ఎం.భుజంగరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఆర్డీవోగా పదోన్నతి కల్పించి పాడేరులో పోస్టింగ్ ఇచ్చింది. పాడేరు సబ్‌కలెక్టర్/ఆర్డీవో పోస్టు గత కొద్ది నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌గా ఐటీడీఏ పీపీవో ఆదిత్యవర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం పాడేరు ఆర్డీవో పోస్టును ఎట్టకేలకు భర్తీ చేసింది.
శిక్షణతో ఉన్నత విద్యాబోధన
చింతపల్లి: ఉన్నత విద్యాబోధన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో, కోర్స్ డైరెక్టర్ పనసల ప్రసాద్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానంపై గురువారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో శిక్షకులు దేపూరి శశికుమార్,యూవీ గిరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


