మండుతున్న మన్యం | - | Sakshi
Sakshi News home page

మండుతున్న మన్యం

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

ఒకవైపు కరిగిపోతున్న అడవులు.. మరోవైపు పెట్రోల్‌, గ్యాస్‌, బొగ్గు వంటి ఇంధనాల మితిమీరిన వాడకం.. ఫలితంగా పెరిగిపోతున్న భూతాపం నేడు మానవ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఒకప్పుడు మానవుడికి ప్రాణమిత్రుడిగా ఉన్న ప్రకృతి.. నేడు శత్రువుగా మారిపోతోంది. దీని ప్రభావంతో ఏటా ప్రకృతి వైపరీత్యాలు కోరలు చాస్తున్నాయి. అతివృష్టి లేదా అనావృష్టి రూపంలో మానవ మనుగడను శాసిస్తున్నాయి.

పెట్రోల్‌ బంక్‌లో నిరంతర సేవలు

జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ సుగునాథం

చింతపల్లి: స్థానికంగా ఉన్న గిరిజన సహకార సంస్థ బంక్‌లో 24 గంటలూ పెట్రోల్‌, డీజిల్‌ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు బ్రాంచ్‌ మేనేజర్‌ సల్లంగి సుగునాథం తెలిపారు. గురువారం ఆయన స్థానిక పెట్రోల్‌ బంక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు రోజంతా నిరంతరాయంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బంక్‌లో మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే, కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి వేళల్లో మందుబాబులు వచ్చి సిబ్బందిని ఇబ్బంది పెడుతుండటంతో రాత్రి సమయం దాటిన తర్వాత బంక్‌ను మూసివేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలూ బంక్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా చింతపల్లి డివిజన్‌ పరిధిలోని మూడు మండలాలకు గ్యాస్‌ కొరత లేదని బీఎం స్పష్టం చేశారు. ఆయా మండలాల్లో వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వెంటనే, ఓటీపీ విధానం ద్వారా ఇంటింటికీ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. డివిజన్‌ పరిధిలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌కు సంబంధించి ఎటువంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.

కొయ్యూరు: సముద్ర మట్టానికి సుమారు రెండు వేల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నందున జిల్లాలో వాతావరణం సాధారణంగా ఎంతో ఆహ్లాదకరంగా, విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి కొండలు 25 నుంచి 40 డిగ్రీల ఏటవాలుగా ఉంటాయి. ఏటా సగటున 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ, గత ఐదేళ్లుగా భూతాపం ప్రభావంతో ఇక్కడి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ పంటల దిగుబడి ఇప్పటికే 10 నుంచి 15 శాతం వరకు పడిపోయింది. భవిష్యత్తులో ఈ దిగుబడులు మరింత ఘోరంగా తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారీగా అంతరించిన అడవి..

అడవులు దట్టంగా ఉంటేనే వాతావరణంలో సమతుల్యత ఉంటుంది. అవి తగ్గేకొద్దీ ఉష్ణోగ్రతలు కోరలు చాస్తాయి. వస్తే ముంచెత్తే వరదలు, లేదంటే ఎండబెట్టే కరవు.. ఇదీ ప్రస్తుత పరిస్థితి. గత నాలుగు సంవత్సరాలలోనే అల్లూరి జిల్లా పరిధిలో దాదాపు వంద కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం అంతరించిపోయింది. పోడు వ్యవసాయం పేరిట చెట్లను నరికి తగలబెట్టడం, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వందలాది ఏళ్ల నాటి పెద్ద పెద్ద చెట్లను యథేచ్ఛగా నరికేయడం..వంటి కారణాల వల్లే ఇప్పుడు మన్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

పెరుగుతున్న పిడుగుల మరణాలు

సాధారణంగా ఏప్రిల్‌ లేదా మే నెలల్లో కురిసే ముందస్తు వర్షాల సమయంలో పిడుగులు పడుతుంటాయి. ముఖ్యంగా ఏ రోజు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుందో, ఆ రోజు సాయంత్రానికి కారుమేఘాలు కమ్మి పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో పడిన పిడుగుల ధాటికి ఎంతో మంది మనుషులతో పాటు మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. సకల జీవరాశికి ఊపిరి పోసే చెట్ల ఉసురు తీస్తున్నందుకే.. ప్రకృతి ఇలా పిడుగుల రూపంలో పగబడుతోంది.

పచ్చదనం చిగురిస్తేనే జీవన ప్రయాణం

బోడి గుట్టలుగా మారిపోతున్న అడవులను తిరిగి పచ్చదనంతో నింపితేనే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేయగలం. భూతాపం బారి నుంచి కొంతవరకై నా ఉపశమనం పొందాలంటే అడవుల పునరుద్ధరణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అటవీ శాఖతో పాటు ప్రభుత్వం రకరకాల శాఖలను సమన్వయం చేసుకుంటూ రైతులకు, స్థానికులకు పెద్ద ఎత్తున పండ్ల మొక్కలను, నీడను ఇచ్చే చెట్లను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ఇందుకు తగ్గట్టుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పాడేరు డివిజన్‌:

1.97 లక్షల హెక్టార్లు

చింతపల్లి డివిజన్‌:

1.96 లక్షల హెక్టార్లు

కొండల ఏటవాలు:

25 నుంచి 40 డిగ్రీలు

నమోదయ్యే వర్షపాతం:

1200 ఎంఎం

గత ఏడాది నమోదైంది :

1473 ఎంఎం

పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషించే చెట్లే లేనప్పుడు వర్షాలు ఎలా వస్తాయనేది ఇప్పుడు మిగిలిన అతిపెద్ద ప్రశ్నార్థకం. అడవులు అంతరిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, పిడుగుపాటు ప్రమాదాలు ఎక్కువవుతాయి, భూగర్భ జలాల ఊటలు ఎండిపోతాయి. నేడు మన్యం ప్రాంతం కూడా ఇదే రీతిలో వేడెక్కుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఎండలు నమోదు కావడం దీనికి నిదర్శనం.

సృష్టిలో మనుషులు పిలిస్తే రానిది.. చెట్లు పిలిస్తే వచ్చేది వర్షం ఒక్కటే..ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికై నా అడవుల రక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అడవి పెంపునకు కార్యాచరణ

చెట్ల నరకివేతను అరికట్టడంలో ప్రజలను దీనిలో బాగస్వామ్యం చేయాలి. పచ్చదనం పెంపొందించేందుకు విరివిగా మొక్కలను నాటా లి. ఇందులో భాగంగా సీడ్‌ బాల్స్‌ సేకరిస్తున్నాం. రాష్ట్రంలోని అటవీప్రాంతంలో జిల్లాకు సంబంధించి 23 శాతం ఉంది. దీనిని వచ్చే ఏడాదికి 30 శాతానికి పెంచేలా కార్యాచరణ రూపొందించాం.

– వైవీ నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి

పెరుగుతున్న భూతాపం

విచ్చలవిడిగా అడవుల నరికివేత

గణనీయంగా తగ్గిపోతున్న విస్తీర్ణం

మానవ మనుగడపై తీవ్ర ప్రభావం

తగ్గుముఖం పడుతున్న వర్షపాతం

10 నుంచి 15 శాతం వరకు

తగ్గిపోతున్న పంటల దిగుబడి

వెంటాడుతున్న అతివృష్టి, అనావృష్టి

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పచ్చదనమే శ్రీరామరక్ష

భూతాపం తగ్గితేనే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు చెట్లను పెంచాలి. పచ్చదనం బాగా ఉంటేనే వాతావరణ సమతుల్యత బాగుంటుంది. తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఫలసాయం ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేయాలి. ఎరువుల వినియోగానికి స్వస్తి పలికి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి. – అప్పలస్వామి,

ఏడీఆర్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌, చింతపల్లి

Advertisement
 
Advertisement
Advertisement