సహజసిద్ధ కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సహజసిద్ధ కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

సాక్షి,పాడేరు: సహజసిద్ధ కాఫీ సాగుతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి తెలిపారు. డోకులూరులో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కాఫీ సహజ వ్యవసాయ సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏజెన్సీలో పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సహజ పద్ధతిలో పండించే కాఫీని అంతర్జాతీయ మార్కెట్‌లో నేచురల్‌ కాఫీగా, ఆర్గానిక్‌ బ్రాండ్‌గా బలంగా ప్రమోట్‌ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వివిధ దేశాల మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడానికి కాఫీ రైతులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా కాఫీ గింజలకు డిజిటల్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహించి, రైతులకు మెరుగైన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. బయ్యర్‌–సెల్లర్‌ సమావేశాలతో పాటు కాఫీ సాగు, ప్రాసెసింగ్‌, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వైఎస్‌ఎస్‌ ఈడీ టి.బాబురావునాయుడు, డీపీఎం భాస్కరరావు, జిల్లా వ్యవసాయాధికారి నందు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, ఏపీఎంఐపీ పీడీ రహీం తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement
 
Advertisement
Advertisement