రోగుల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

రోగుల ప్రాణాలతో చెలగాటం

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

అంబులెన్సు దుస్థితిపై మండిపడ్డ అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం

అదనంగా అంబులెన్సులుఏర్పాటు చేయాలని డిమాండ్‌

సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లోని పాడేరుతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అదనంగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్‌ చేశారు. డుంబ్రిగుడ మండలంలో బైక్‌ ప్రమాదంలో గాయపడి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన యువకులను బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌ చేసిన రోగులను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. ఒకే అంబులెన్స్‌లో అధికమంది రోగులను కేజీహెచ్‌కు తరలిస్తున్న పరిస్థితిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులతో పాటు వివిధ వ్యాధులతో బాధపడేవారిని ఒకచోట ఉంచి విశాఖ తీసుకువెళ్లడం మంచిది కాదని రోగులకు అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఆయన వైద్యులను నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి రక్షణ కరువైందన్నారు. అధిక సంఖ్యలోని రోగులతో ఘాట్‌ ప్రాంతాల్లో అంబులెన్స్‌లు ప్రయాణించడం కూడా ప్రమాదకరమన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు.గిరిజనుల వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అన్ని ఆస్పత్రులలోను అదనంగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సాగర ఎంపీటీసీ వంతాల దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement