ఆ తల్లుల కడుపుకోతకు అంతులేకుండా పోయింది.. రెక్కలొచ్చి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారనుకున్న ఇద్దరు యువకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ గ్రామం తల్లడిల్లిపోయింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు నవ యువకులను బలితీసుకుంది, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన తీవ్ర శోకాన్ని నింపింది.
● మరొకరి పరిస్థితి విషమం
● కండ్రుమ్ నూతన వంతెన వద్ద ఘటన
● బస్ షెల్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం
● మృతులు కోసొంగుడ వాసులు
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కోసొంగుడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని చట్టువా గ్రామానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి సొంత ఊరువస్తుండగా, కండ్రుమ్ నూతన వంతెన సమీపంలో ఉన్న బస్సు షెల్టర్‌ను వారి మోటార్ సైకిల్ వేగంగా ఢీకొట్టిందని ఎస్‌ఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనలో చెడ్డ శేషుప్రవీణ్ (21) అనే యువకుడు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై పడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడు డిప్పల తాజేశ్వరరావు(20)ను స్థానికులు 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అతడు కూడా కన్నుమూశాడు. కాగా, వంతాల అరవింద్(22) అనే మరో యువకుడు ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో పరిస్థితి విషమంగా భావించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
మృతులిద్దరిది ఒకే గ్రామం..
చేతికంది వచ్చిన ఇద్దరు యువకులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో కోసొంగుడ గ్రామంలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఏడుపులు, ఆర్తనాదాలతో ఆసుపత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతదేహాలను చూసి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
హెల్మెట్ ధరించండి.. వేగం తగ్గించండి..
పోలీసుల హృదయ విదారక విన్నపం
రోడ్డు ప్రమాదాల నివారణకు తాము ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నా యువతలో మార్పు రావడం లేదని ఎస్‌ఐ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణించి, క్షణకాలం అజాగ్రత్తతో కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన యువత, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
జి.మాడుగుల: లంబసింగి–జి.మాడుగుల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల కోసం నీటిని తరలిస్తున్న వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం లింగేరిపుట్టు గ్రామానికి చెందిన డ్రైవర్ పాంగి ిసిద్ధు, జాతీయ రహదారి నిర్మాణ పనుల నిమిత్తం బుధవారం వంజరి పరిసరాల్లోని పారుగెడ్డ నుంచి వాటర్ ట్యాంకర్‌లో నీటిని నింపుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ కింద పడిపోయిన సిద్ధుకు తీవ్ర గాయాలవ్వడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.
బస్ షెల్టర్‌ను బైక్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం


