పలుగు, పార చేతపట్టి.. | - | Sakshi
Sakshi News home page

పలుగు, పార చేతపట్టి..

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

కుమిడికుంటి గ్రామస్తులు శ్రమదానం

రహదారికి సొంతంగా మరమ్మతులు

డుంబ్రిగుడ: ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారకపోవడంతో.. ఆ గిరిజన గ్రామస్తులు ఎవరికోసమో ఎదురుచూడకుండా తామే పారలు, గడ్డపారలు చేతబట్టారు. మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఉన్న కుమిడికుంటి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బుధవారం శ్రమదానంతో రహదారికి మరమ్మతులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన ఈ దారిని శ్రమదానంతో మెరుగుపరచుకున్నారు.

నిధులున్నా పూర్తికాని పనులు

ఈ రోడ్డు నిర్మాణానికి 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరయ్యాయి. అయితే, అధికారులు, కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్ల పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. కేవలం కొంతమేర మాత్రమే పనులు చేసి, మధ్యలో మట్టి పోసి పనులను నిలిపివేశారని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన గిరిజనులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

● గతంలో అరకొరగా వేసిన రోడ్డు కాస్తా భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. గుంతలమయంగా మారిన ఈ దారిలో రాకపోకలు సాగించడం ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో, గ్రామస్తులే స్వయంగా పెద్ద పెద్ద బండరాళ్లను తెచ్చి, పేర్చి రక్షణ గోడను నిర్మించారు. వర్షపు నీటికి రోడ్డు మరింత దెబ్బతినకుండా ఉండేందుకు నీరు పోయేలా కాలువలను కూడా ఏర్పాటుచేశారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంతాల సీతారాం, చిన్నయ్య, దాసు, పీసా కమిటీ కార్యదర్శి, సుల్‌, శాంతి తదితరులు ముందుండి గ్రామస్తులను నడిపించారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కుమిడికుంటి గ్రామానికి శాశ్వత, నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement