● కలెక్టర్ నిశాంతి
● హుకుంపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
● 160 అర్జీల స్వీకరణ
హుకుంపేట (డుంబ్రిగుడ): ప్రజా సమస్యల పరిష్కారంలో, విధి నిర్వహణలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంతి హెచ్చరించారు.. బుధవారం హుకుంపేటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్, జేసీ తిరుమణి శ్రీపూజ హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 160 అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యం
సమస్యల వినతుల్లో ప్రధానంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపైనే ఎక్కువ వినతులు వచ్చాయి. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. 100 కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ. 400 కోట్ల విలువైన రహదారి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, ప్రాధాన్యత క్రమాన్ని బట్టి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక నిధులు:
మండలవ్యాప్తంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉంటే.. తక్షణమే ఎంపీడీవో, జెడ్పీ సీఈవోలతో మాట్లాడి మండల నిధులు లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రెవెన్యూ, సివిల్ వివాదాలను స్థానిక తహసీల్దార్ పర్యవేక్షించాలని, అవసరమైన చోట పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ వేదికలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


