● ఆగ్రహానికి గురైన చింతపల్లిఎంపీపీ కోరాబు అనూషదేవి
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని
ఎంపీపీకి సూచన
చింతపల్లి: మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ కోరాబు అనూషదేవి హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దారు శంకర్రావు మాట్లాడుతూ మండలంలో భూ రీసర్వే కార్యక్రమం వేగంగా జరుగుతోందని, ఈ నెలలో 11 గ్రామాల్లో 780 నూతన భూమి పట్టాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మరో 43 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ఎంఈవో ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటు కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా చేపడుతున్నామని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి తెలిపారు.
గైర్హాజర్ అయిన అధికారులపై ఆగ్రహం
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశానికి కొన్ని శాఖల మండల అధికారులు హాజరు కాకపోవడంపై ఎంపీపీ అనూషదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి శాఖ అధికారి ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే కొంతమంది అధికారులు ఆ విషయాన్ని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని ముందే సమాచారం అందించినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి గైర్హాజరైన పీహెచ్‌సీ అధికారులు, పంచాయతీరాజ్, గృహనిర్మాణ, జీసీసీ, ఆర్టీసీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, మండల వ్యవసాయాధికారి టి.మధుసూదనరావు, ఏపీఎం శ్రీనివాసరావు, పీఆర్ జేఈ బాలకిషోర్, సీడీపీవో శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


