సీలేరు: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణకు త్వరలోనే వాటర్ మిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ (సీఈ) కేవీ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శ్రీశైలం తరహాలోనే ఇక్కడ కూడా వాటర్ మిస్ట్ ఏర్పాటుకు హైడల్ డైరెక్టర్, టెక్నికల్ టీమ్ అనుమతి ఇచ్చారని చెప్పారు.
మాచ్‌ఖండ్‌లో యుద్ధప్రాతిపదికన పనులు
మాచ్‌ఖండ్ ప్రమాదంలో 3, 4 నంబర్ యూనిట్లతో పాటు మెయిన్ కంట్రోల్ రూమ్‌లోని ప్యానల్ బోర్డులు దెబ్బతిన్నాయని సీఈ వివరించారు. వీటికి అవసరమైన సామగ్రిని సేకరిస్తున్నామని, ఆంధ్రా–ఒడిశా ఇంజనీర్లు సంయుక్తంగా శ్రమిస్తున్నారని తెలిపారు. నెల రోజుల్లో రెండు యూనిట్లను, మరో రెండు నెలల్లో మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు.
రోజుకు 8 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సీలేరు, పొల్లూరు కేంద్రాల నుంచి ప్రస్తుతం రోజుకు 8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు సీఈ పేర్కొన్నారు. డొంకరాయి మినీ జలవిద్యుత్ కేంద్రంలో ఓవరాలింగ్ పనులు పూర్తయ్యాయని, వారంలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే పొల్లూరు రెండో దశలో నిర్మిస్తున్న 5, 6 యూనిట్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈలు జాకీర్ హుస్సేన్, సీతారామ్, ఈఈలు బాలకృష్ణ, టి.అప్పలనాయుడు పాల్గొన్నారు.


