విత్తన కష్టం | - | Sakshi
Sakshi News home page

విత్తన కష్టం

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

గిరి రైతుకు

సాక్షి,పాడేరు: ఈ ఏడాది ఖరీఫ్‌ వరి సాగుకు మన్యంలో విత్తనాల కొరత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ముందస్తుగా గిరిజన రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను అందుబాటులోకి తేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులంతా ఖరీఫ్‌ దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 80 శాతం భూముల్లో మొదటి దశ దుక్కులు పూర్తి కావడంతో నారుమడుల తయారీకి సిద్ధమవుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో విత్తనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో దాదాపు 40 వేల హెక్టార్లలో గిరిజన రైతులు ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేస్తారు. దీనికోసం దాదాపు 20 వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు అవసరం.

ప్రతిపాదనకే పరిమితం

జిల్లా వ్యాప్తంగా 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉన్నప్పటికీ, వ్యవసాయ శాఖ కేవలం 13 వేల క్వింటాళ్లకే రెండు నెలల క్రితం ఇండెంట్‌ పెట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. గిరిజన ప్రాంతం కావడంతో 90 శాతం సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం వరి విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, గిరిజన రైతులు ఖరీఫ్‌ పనుల్లో వేగం పెంచినా కూటమి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు మన్యానికి విత్తనాలను సరఫరా చేయలేదు. అదును దాటిపోతున్నా వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తుగానే ఖరీఫ్‌ పనులు

జిల్లాలో కురుస్తున్న అనుకూల వర్షాలతో రైతులు ముందస్తుగానే ఖరీఫ్‌ సాగు పనులకు శ్రీకారం చుట్టారు. భూములన్నీ తడిసి ముద్దవడంతో నారుమడుల తయారీకి వాతావరణం ఎంతగానో అనుకూలించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వరి విత్తనాల పంపిణీ ఊసెత్తడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే 90 శాతం సబ్సిడీపై రైతులకు సకాలంలో విత్తనాలు అందించి ఆదుకునేదని గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు.

ప్రైవేట్‌ దుకాణాలు, సంతల్లో కొనుగోలు

ప్రభుత్వం సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో గిరిజన రైతులంతా ప్రైవేట్‌గా వరి విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాల్లోని విత్తన దుకాణాలతో పాటు వారపు సంతల్లో అమ్మే పలు రకాల వరి విత్తనాలకు ప్రస్తుతం భారీ డిమాండ్‌ నెలకొంది. 10 కిలోల విత్తన బ్యాగును రూ. వెయ్యి నుంచి రూ. 1200 వరకు అధిక ధరలు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు.

జోరుగా అమ్మకాలు

అరకు, పాడేరు, సుంకరమెట్ట, కాశీపట్నం, డముకు, కించుమండ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, గుత్తులపుట్టు, కుమడ, మద్దిగరువు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, దారకొండ వారపు సంతల్లో విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నారుమడులు పోయడానికి ఇదే సరైన సమయం కావడంతో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు మేలు రకం వరి వంగడాలను కొంటున్నారు. శనివారం జరిగిన వారపు సంతలోని సుమారు 10 దుకాణాల్లో విత్తన అమ్మకాలు భారీగా జరిగాయి. గిరిజన రైతులు విత్తన మూటలను తమ గ్రామాలకు మోసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

అదును వచ్చినా అందని వైనం

ఇండెంట్‌కే పరిమితం

నారుమడులు వేసే వేళ తప్పని తిప్పలు

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం

ప్రైవేట్‌ మార్కెట్లో అధిక ధరకు

కొనుక్కోవాల్సిన దుస్థితి

కూటమి ప్రభుత్వం తీరుపైఅన్నదాత ఆగ్రహం

ప్రైవేట్‌ దుకాణంలోకొనుక్కున్నా..

90శాతం సబ్సిడీపై ఖరీఫ్‌లో నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దుక్కి పనులు పూర్తి చేయడంతో నారుమడులకు విత్తన సమస్య ఏర్పడింది. పాడేరులోని ప్రైవేట్‌ దుకాణంలో కిలో రూ.100తో 10 కిలోల వరి విత్తనాలను కొనుగోలు చేశా.

– వంతాల బొంజుబాబు, బురదపాడు,

పాడేరు మండలం

అదునుకు ఇవ్వకపోవడం అన్యాయం

వ్యవసాయశాఖ అదునుకు వరి విత్తనాలు పంపిణీ చేయకపోవడం అన్యాయం.గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సకాలంలో విత్తనాలను ఆర్‌బీకే కేంద్రాల వద్ద పంపిణీ చేసేది.గత ఏడాది లాగే ఈసారి కూడా విత్తన పంపిణీ ఆలస్యం చేయడంతో మార్కెట్‌లో అధిక ధరలకు కొనుక్కున్నా.

– కిల్లో లక్ష్మి, మహిళా రైతు,

చింతగొంది, పాడేరు మండలం

ముందస్తుగానే ప్రతిపాదన

ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 90శాతం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీకి ముందస్తుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభు త్వం నుంచి విత్తనాలు మూడు నాలుగు రోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. అవి సరఫరా అయిన వెంటనే గిరిజన రైతులకు పంపిణీ చేసేలా తగు చర్యలు తీసుకుంటాం. రైతులు

– ఎస్‌బీఎస్‌ నందు,

జిల్లా వ్యవసాయాధికారి,

పాడేరు

Advertisement
 
Advertisement
Advertisement