జి.మాడుగుల: మండలంలోని గాంధీనగర్ కై లాసగిరి క్షేత్ర ఆవరణలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నాల్గువ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. భీమిలి సద్గురు సేవాశ్రమం, శ్రీహనుమ సేవాశ్రమం సాయిరాం స్వామీజీ (యోగరాజు) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచముఖ ఆంజనేయ స్వామి పల్లకీ తిరువీధి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో జల, క్షీర, పంచామృతాభిషేకాలు, సహస్రనామ పూజలు, రామనామ సంకీర్తన, శ్రీహనుమ, రామ భజనలు నిర్వహించారు. అలాగే భక్తి గాన సుధ, సర్వదేవతా రాగసుధ, శృతిలయ భజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కై లాసగిరి క్షేత్రం మారుమోగింది.
ఆకట్టుకున్న వేషధారణలు..కోలాటం
వివిధ మండలాల నుంచి తరలివచ్చిన భజన బృందాల కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శనలు భక్తిరసాన్ని పంచాయి. గాంధీనగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ తిరువీధి యాత్ర పురవీధుల గుండా రామాలయం, పాకలపాటి గురుదేవుల ఆలయం వరకు సాగింది. ఊరేగింపులో చిన్నారులు వేసిన శ్రీరామ, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన భక్తులకు సాయిరాం స్వామీజీ పలు పూజా వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది.
ప్రముఖుల హాజరు
ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, సర్పంచ్ కిముడు రాంబాబు పాల్గొన్నారు. వారితో పాటు సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా పరియోజన ప్రముఖ్ ఎం. మత్స్యరాజు, శ్రీ షిరిడీ సాయి ఆలయ ధర్మకర్త కిముడు వెంకటరమణ, విశ్వహిందూ పరిషత్ జిల్లా ధర్మప్రచార ప్రముఖ్ రీమలి అప్పలరాజు, వార్షికోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు నీలకంఠం, రామానందం, భీమశంకర్ నాయుడు, ఎ. శ్రీను, భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఘనంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం
భక్తి రసాన్ని పంచిన
సాంస్కృతిక ప్రదర్శనలు
కై లాసగిరిపై ఆధ్యాత్మిక సందడి


