ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ సుజనపేట గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను సరిహద్దు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా సోమవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మంగళవారం భక్తులు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. ఈ పండగను తిలకించేందుకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆకట్టుకునేలా విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు.
వాలీబాల్ టోర్నీ విజేత ‘ఏనుగురాయి’
ముత్యాలమ్మ తల్లి పండగను పురస్కరించుకుని నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ఏనుగురాయి జట్టు విజేతగా నిలిచింది. గత వారం రోజులుగా ఈ క్రీడలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఆదివారం నిర్వహించిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో ఏనుగురాయి, చిప్పపుట్టు జట్లు తలపడగా.. చిప్పపుట్టుపై ఏనుగురాయి జట్టు ఘన విజయం సాధించింది. మరోవైపు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ముంచంగిపుట్టు, బీటా జట్ల మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు జాతర రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై బహుమతుల ప్రదానం చేస్తామని మాజీ సర్పంచ్ రమేష్, నిర్వాహకులు సుమన్, బొందు చిన్నారావు, త్రినాథ్ తెలిపారు.
సుజనపేటలో ఘనంగా ఏర్పాట్లు


