నాడు వైఎస్సార్‌సీపీ పోరాటం..
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష విశాఖ రైల్వే జోన్.. అది కేవలం ఒక కార్యాలయం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టం కల్పించిన ఒకే ఒక్క ఊరట రైల్వే జోన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ప్యాకేజీ దాసోహం.. స్వార్థ రాజకీయాల మధ్య ఆ ఆశల దీపం కొడిగట్టిపోయిన వేళ.. పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్సార్‌సీపీ చేసిన రాజీలేని పోరాటమే ఇన్నాళ్లకు ఆ కలను సాకారం చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏ స్వలాభం కోసం ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడితే.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని ఉద్యమం చేసింది. లాఠీ దెబ్బలు తిన్నా, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా కేంద్రం మెడలు వంచి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ను సాధించిన ఆ పోరాట ప్రస్థానం ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ గర్జన
అధికారంలో ఉన్న టీడీపీ.. జోన్ ఊసెత్తకపోయినా.. వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 2016 మార్చిలో విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినతిపత్రాలు సమర్పించాయి. అయినా పాలకుల్లో చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి.
ఆమరణ దీక్షలు.. నిరసన ప్రదర్శనలు!
జోన్ ఆవశ్యకతను ఢిల్లీకి వినిపించేలా 2016 ఏప్రిల్ 14న అప్పటి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజల నుంచి ఈ దీక్షకు అనూహ్య స్పందన లభించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి.. అక్రమ కేసులు బనాయించింది. ఇటీవలే ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగకుండా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎప్పుడు కుదిరితే అప్పుడు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశాఖ జోన్‌కు మొండిచేయి చూపడంతో వైఎస్సార్‌సీపీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే విశాఖ వీధుల్లోకి వచ్చిన పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాయి.
‘రైల్ రోకో’తో ఉద్యమం తీవ్రస్థాయికి.!
ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం 2018 ఏప్రిల్ 11 నాటి ‘రైల్ రోకో’. కేంద్రం హామీని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా విశాఖ రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. ట్రాక్‌ల మీద బైఠాయించి నిరసన తెలిపారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటాల్ని అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించింది. లాఠీ చార్జీలు చేయించింది. ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించింది. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. జోన్ సాధించే వరకు విశ్రమించబోమని మరింత గట్టిగా నినదించారు. ఈ రైల్ రోకో ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పోరాటానికి తలొగ్గిన కేంద్రం..!
రైల్వే జోన్ పోరాటాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తున్నా.. కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా.. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చేసిన ఈ నిరంతర పోరాటం ఎట్టకేలకు ఫలించింది. విశాఖ వీధుల్లో రగిలిన ఈ ఉద్యమ సెగ ఢిల్లీకి చేరింది. ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీ చేసిన ప్రజా పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పోరాటం చేయాల్సిన అధికార టీడీపీ రాజీపడినా.. స్వప్రయోజనాల కోసం మౌనం వహించినా.. ‘పవర్’లో లేకపోయినా.. అలుపెరగని పోరాటం చేస్తే.. దశాబ్దాల కలను కూడా ఎలా సాధించవచ్చో వైఎస్సార్‌సీపీ నిరూపించింది. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ సాకారమైందంటే.. అది ప్రస్తుత పాలకుల వల్ల కాదు.. వైఎస్సార్‌సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలకు రోడ్ల మీద పడ్డ లాఠీ దెబ్బలు, ఎదుర్కొన్న కేసుల ఫలితమే అని దక్షిణ కోస్తా రైల్వే జోన్ చరిత్ర ఎప్పటికీ చెబుతూనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం.


