ప్రభుత్వ స్థలంలో ఫెన్సింగ్
రూ.కోటి స్థలంపై కన్నేసిన
కూటమి నేతలు
అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని చిన్నిపేట సర్వే నంబర్ 67లో ఉన్న సుమారు 18 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఈ స్థలాన్ని మూడు రోజులుగా జేసీబీతో చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వ భూమిలో దళిత కుటుంబాలు నివాసాల కోసం పాకలు వేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైందని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అనంతరం అక్కడ సాయిబాబా ఆలయం, సామాజిక భవనాలు నిర్మించారని, ఆలయ పూజారి పేరుతో నిర్మించిన ఇంటిని ప్రస్తుతం ఇతరులకు అద్దెకు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూమిని వాటాలుగా పంచుకునేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన ఓ పేద మహిళ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఆమెకు 60 గజాల స్థలం కేటాయించడంలో మాత్రం అధికారులు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వీఆర్వో రిజ్వాన్‌ను వివరణ కోరగా.. ఫెన్సింగ్ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. వీఆర్‌ఏను పంపించి స్థలాన్ని పరిశీలించి, నివేదికను భీమిలి తహసీల్దార్‌కు అందజేస్తానని చెప్పారు.
వీఆర్వోకు తెలియదట..!


