రోడ్లు మరిచారు! | - | Sakshi
Sakshi News home page

రోడ్లు మరిచారు!

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

హామీలిచ్చారు..
కూటమి సర్కారుపై గిరిజనాగ్రహం

శిథిలావస్థలో డోకులూరు ప్రధాన వంతెన

రాళ్లు తేలిన చీడిమెట్ట జంక్షన్‌ రోడ్డు

ఎన్నికల వేళ గిరిజన పల్లెల్లో ప్రచార ఆర్భాటం చేసిన కూటమి నేతలు రాష్ట్రంలో అధికారం చేపట్టాక ముఖం చాటేయడం

పరిపాటిగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, నాడు ఇచ్చిన ఎన్నికల హామీలు నేటికీ గిరిజన ప్రాంతాల్లో అమలుకు నోచుకోలేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాడేరు రూరల్‌ మండల పరిధిలోని ప్రధాన రహదారులు ప్రస్తుతం అధ్వానపు బాటలకు కేరాఫ్‌గా మారాయి. ప్రజాప్రతినిధులు,

ఉన్నతాధికారులు ఇటువైపు పర్యటనలు

చేస్తున్నప్పటికీ వీటి దుస్థితి మారకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు రూరల్‌: మండలంలోని డోకులూరు, బర్సింగి, గుత్తులపుట్టు, డిగొందూరు గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదని సమీప గ్రామాల ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● గుత్తులపుట్టు పంచాయతీ చీడిమెట్ట జంక్షన్‌ నుంచి గడివలస మీదుగా గుత్తులపుట్టు సంతబయలు, జికొత్తూరు మీదుగా డోకులూరు వయా డి.గొందూరు వరకు రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో పలు సందర్భాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత నరకప్రాయంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు ఈ రహదారి గుండా ప్రయాణించినప్పటికీ, ఇక్కడి దుస్థితిని మార్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గిరిజనులు మండిపడుతున్నారు.

● జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న డోకులూరు పంచాయతీ పరిసర ప్రాంతాల మార్గం అధ్వానంగా మారినప్పటికీ, ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. డోకులూరు గ్రామంలో ఇప్పటికే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ పాఠశాల ఏర్పాటుతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరగనుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులు, వాహనదారులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులు చేపడితే..

30 గ్రామాలకు కనెక్టివిటీ..

ఈ రహదారికి మరమ్మతులు చేపడితే గిరిజనులు పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లకుండానే ఇటు పెదబయలుకు, అటు జి.మాడుగులలోని వివిధ ప్రాంతాలకు సులువుగా ప్రయాణించవచ్చు. ప్రధానంగా సంతబయలు నుంచి జికొత్తూరు, డోకులూరు మీదుగా డి.గొందూరు వరకు రోడ్డు విస్తరణ చేపట్టి, మరమ్మతులు పూర్తి చేస్తే సుమారు 30 గిరిజన గ్రామాలకు నేరుగా రవాణా సౌకర్యం కలుగుతుంది. దీంతో పాటు బైపాస్‌ మీదుగా జి.మాడుగుల, ఇతర సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులతో పాటు కూటమి పాలకులు ముందస్తు చర్యగా ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలావస్థలో వంతెనలు..

పొంచి ఉన్న ప్రమాదాలు

ఈ మార్గంలో ఉన్న పురాతన కల్వర్టులు, వంతెనలు, సీసీ ర్యాంపులు పూర్తిగా దెబ్బతిని నిత్యం ప్రమాదాలకు సంకేతంగా మారాయి. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని గిరిజన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పాడేరు జిల్లా కేంద్రానికి డోకులూరు మీదుగానే ప్రధాన రహదారి మార్గం ఏర్పడే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్రాంగం ఇప్పటికై నా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పాడేరు ఏజెన్సీలో

అధ్వానంగా రహదారులు

గుత్తులపుట్టు, డోకులూరు మార్గంలో

అస్తవ్యస్తంగా రోడ్లు

30 గ్రామాలకు తప్పని అవస్థలు

జిల్లా కేంద్రానికి కూతవేటు

దూరంలోనే రోడ్ల దుస్థితి

విస్తరిస్తేనే పెదబయలు, జి.మాడుగులకు సులువైన ప్రయాణం

పట్టించుకోని కూటమి పాలకులు

రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి

జిల్లా కేంద్రంతో పాటు మారుమూల ప్రాంతాల ప్రధాన రోడ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ మార్గాలను నిర్మించాలి. పాడేరు పట్టణంతో అసలు సంబంధం లేకుండానే డోకులూరు పంచాయతీ కేంద్రం.. అటు జి.మాడుగుల, ఇటు పెదబయలు వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు ప్రధాన కూడలి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు ఈ రోడ్డు విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

– తమర్బ ప్రసాద్‌ నాయుడు, న్యాయవాది,

డోకులూరు, పాడేరు

ఎన్నికల హామీలు నెరవేర్చాలి

గుత్తులపుట్టు సంతబయలు నుంచి డోకులూరు మీదుగా డి.గొందూరు వరకు రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. ఈ మార్గంలోని కల్వర్టులు, వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గుంపులు గుంపులుగా గిరిజన గ్రామాలకు వచ్చిన కూటమి నాయకులు.. గెలిచి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదు, వారి జాడ లేదు. ఇచ్చిన ఎన్నికల హామీలను ఇప్పటికై నా వెంటనే నెరవేర్చాలి. – ఎస్‌. రవికుమార్‌, జి.కొత్తూరు,

పాడేరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement