గిరి మహిళల ‘అడ్డాకు’ రోదన | - | Sakshi
Sakshi News home page

గిరి మహిళల ‘అడ్డాకు’ రోదన

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

దోపిడీ అన్యాయం

వారం వ్యవధిలోనే అడ్డాకుల ధరలను వ్యాపారులు తగ్గించడం అన్యాయం.అష్టకష్టాలు పడి అడ్డాకులను సేకరించి అమ్మకాలు జరిపితే కావిడకు రూ.2వేలు రావడం బాధనిపించింది. గత వారం రూ.4వేలతో కొన్న వ్యాపారులు ఈవారం రూ.2వేలు తగ్గించి మోసం చేశారు.

– ఏడేల అమ్మాజి,కాగిపుట్టు, హుకుంపేట మండలం

సాక్షి, పాడేరు: ఘాట్‌ రోడ్లు, కొండ కోనల్లో అష్టకష్టాలు పడి గిరిజన మహిళలు సేకరించిన అడ్డాకులకు చివరకు అన్యాయమే మిగులుతోంది. హుకుంపేట వారపు సంతకు శనివారం భారీగా అడ్డాకులు తరలిరావడంతో, మైదాన ప్రాంతానికి చెందిన వ్యాపారులంతా అంతర్గతంగా సిండికేట్‌గా మారి ధరలను దారుణంగా పతనం చేశారు. గతవారంలో ఒక కావిడి (రెండు దిండ్లు) అడ్డాకులకు రూ.4వేల వరకు ధర పలకగా, ఈ వారం మాత్రం వ్యాపారులు కుమ్మకై ్క కేవలం రూ.2వేలకు కొనుగోలు చేయడంతో గిరిజన మహిళలంతా ఉసూరుమన్నారు. కాస్త చిన్న సైజు దిండ్లు అయితే రూ.వెయ్యి నుంచి రూ.1,500లకే కొల్లగొట్టారు. ఇలా సంతకు వచ్చిన గిరిజన మహిళలంతా వ్యాపారుల చేతిలో ఘోరంగా దోపిడీకి గురయ్యారు.

● శనివారం ఉదయం 6 గంటల నుంచే గిరిజన మహిళలు భారీగా అడ్డాకులను కావిళ్లపై మోసుకుంటూ హుకుంపేట సంతకు చేరుకున్నారు. సమయం గడిచేకొద్దీ 10 గంటలకై నా ధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసిన గిరిజన శ్రామికులకు నిరాశే మిగిలింది. వ్యాపారులంతా ఒకే మాటపై నిలబడి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండడంతో, గిరిజనులు ఏమీ చేయలేకపోయారు. మారుమూల గ్రామాలకు అంత బరువున్న అడ్డాకులను తిరిగి మోసుకుపోవడం సాధ్యం కాక, చివరకు వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వచ్చింది.

రూ.4 లక్షల వ్యాపారం..

లాభాలన్నీ మైదానానికే!

ఈ దారుణమైన ధరల పతనం మధ్యే సంతలో శనివారం సుమారు రూ.4 లక్షల వరకు అడ్డాకుల వ్యాపారం సాగింది. గిరిజన మహిళల నుంచి తక్కువ ధరలకే ఆకులను గుంజుకున్న మైదాన ప్రాంత వ్యాపారులు.. వాటిని లారీల ద్వారా మైదాన నగరాలకు తరలించి భారీగా లాభాలు గడించారు. రేయింబవళ్లు అడవుల్లో తిరిగి ఆకులు సేకరించిన గిరిజన మహిళల శ్రమ దోపిడీకి గురై, ఈ సంతలో వారికి తీవ్ర అన్యాయం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కావిడి ధర రూ.4 వేల నుంచిరూ.2 వేలకే పతనం

హుకుంపేట వారపు సంతలో సిండికేట్‌గా మారిన మైదాన వ్యాపారులు

అడ్డాకుల కొనుగోళ్లలోరూ.లక్షల్లో దోపిడీ

Advertisement
 
Advertisement
Advertisement