మత్స్యగెడ్డలో ఇసుక మాఫియా యథేచ్ఛగా దందా సాగిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమార్కుల కాసుల కక్కుర్తికి ఇప్పటికే నలుగురు బలైనా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, పాడేరు: ఏజెన్సీలోని ప్రధాన జీవనది అయిన మత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్స్యగెడ్డలోని అనేక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వ్యాన్లు, టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులు, ఆపరేటర్లు ఈ ఇసుక దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల వరకు విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో సుమారు 15 వరకు అక్రమ ఇసుక క్వారీలు వెలిశాయి. దీనివల్ల ప్రతిరోజూ ఇక్కడ రూ.లక్షల విలువైన ఇసుక వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం మత్స్యగెడ్డ అంతా ఇసుక మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా మారాయి. ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ, వాహనాల ఆపరేటర్లు స్థానిక గ్రామాల్లోని కొందరు గిరిజనులను డబ్బు ఆశ చూపి ఈ పనులకు ప్రోత్సహిస్తున్నారు. పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో జరిగే నిర్మాణాలకు ఈ మత్స్యగెడ్డ ఇసుకే ప్రధాన ఆధారంగా మారడంతో వ్యాన్ ఆపరేటర్లకు కాసుల వర్షం కురుస్తోంది.
● నిజానికి మైదాన ప్రాంతాల్లోని అధికారిక ఇసుక రీచ్‌ల నుంచే ఏజెన్సీకి ఇసుకను రవాణా చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ, అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రభుత్వ భవనాలతో పాటు స్థానిక ప్రజల ఇళ్ల నిర్మాణాలన్నింటికీ మత్స్యగెడ్డ ఇసుకనే వినియోగిస్తుండడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల నిర్వహణ, రవాణా, అమ్మకాలను సదరు ఆపరేటర్లు నిర్భయంగా సాగిస్తున్నారు.
● మండల కేంద్రాల మీదుగానే ఇసుక వాహనాలు అక్రమంగా రవాణా అవుతున్నా.. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.10 వేల వరకు విక్రయిస్తుండడంతో అక్రమార్కులకు భారీగా లాభాలు దక్కుతున్నాయి. అలాగే గెడ్డ అవతలి వైపు ఉన్న ఒడిశా ప్రాంతానికి చెందిన వ్యాన్ ఆపరేటర్లు కూడా ఇక్కడి నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు.
● మత్స్యగెడ్డలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు మరోవైపు స్థానికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రస్తుతం మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. అయినప్పటికీ గిరిజనులు మెడ లోతు నీటిలో మునుగుతూ ఇసుకను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన ఇసుకను ప్రమాదకర పరిస్థితుల్లో రవాణా చేస్తున్నారు. ఈ పనులన్నీ అత్యంత ప్రమాదకరమని తెలిసినా.. వ్యాన్ ఆపరేటర్లు కేవలం లాభాల కోసమే గిరిజనులను ప్రమాదాల్లోకి నెడుతున్నారు.
● మరోవైపు మత్స్యగెడ్డలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తుండడంతో ఆయా ప్రాంతాలు లోతుగా మారుతున్నాయి. ఫలితంగా నదిలో స్నానాలకు దిగుతున్న చిన్నారులు, గిరిజనులు లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే మత్స్యగెడ్డలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందినప్పటికీ, ఇసుక వ్యాపారులు గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇసుక మాఫియా గునపం పోట్లకు విలవిల రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు
నిబంధనలు గాలికొదిలేసిన అక్రమార్కులు మృత్యుకుహరంగా మారిన నదీ గర్భం
కాసుల కక్కుర్తికి ఇప్పటికే నలుగురు బలి నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం


