● సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్
కృష్ణారావు
● నుర్మతి ఆశ్రమ పాఠశాల
టెన్త్ టాపర్లకు ఘన సత్కారం
జి.మాడుగుల: గిరిజన విద్యార్థినులు ఉన్నత విద్యతో పాటు లక్ష్యసాధనను అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, తద్వారా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని నుర్మతి సీఆర్‌పీఎఫ్ డి–198 బెటాలియన్ క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ డి. కృష్ణారావు పిలుపునిచ్చారు. మండలంలోని నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 2026 పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం 198 బెటాలియన్ కమాండెంట్ రామ్ పలట్ ఆదేశాల మేరకు.. నుర్మతి క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణారావు విద్యార్థినులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బాలికల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఆడపిల్లలను రక్షిద్దాం – ఆడపిల్లలను చదివిద్దాం.. నినాదంతో ప్రతిభావంతులైన బాలికలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లోని ఇతర బాలికల్లోనూ చదువు పట్ల శ్రద్ధ పెంచేందుకు సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు దుస్తులు ఆరబెట్టుకునేందుకు వైర్ల ఏర్పాటు, పరీక్షల కోసం పెన్నుల పంపిణీ వంటి పలు సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల కుటుంబంతో పాటు సమాజంలోనూ గొప్ప మార్పులు వస్తాయని, ఉన్నత విద్యతో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ సాయిరాం పడాల్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. 198–డీ బెటాలియన్ అధికారులు, జవాన్లతో పాటు వివిధ గ్రామాల విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


