సరియా విహారం.. తీరని విషాదం | - | Sakshi
Sakshi News home page

సరియా విహారం.. తీరని విషాదం

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

జలపాతంలో పడి ఇంజనీరింగ్‌ విద్యార్థి వరప్రసాద్‌ మృతి

ప్రవాహంలోంచి మృతదేహాన్ని

బయటకు తీసిన వలంటీర్లు

సాక్షి, పాడేరు: వీకెండ్‌ సరదా.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని వెళ్లిన ఆ యువకుడు.. అనంతగిరి కొండల్లోని ప్రమాదకర సరియా జలపాతం రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయాడు. విశాఖ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ, ఎన్నో ఆశలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఇండుగబిల్లి వరప్రసాద్‌ (19) జలపాతంలో మునిగి మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది.

క్షణంలో ముంచేసిన మృత్యువు

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ నగరంలోని గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ ప్రాంతానికి చెందిన వరప్రసాద్‌ తన స్నేహితులు దున్న అభిలాష్‌, డోలా లక్ష్మణరావులతో కలిసి శుక్రవారం బైక్‌పై అనంతగిరి మండలం మారుమూల ప్రాంతంలోని సరియా జలపాతానికి వచ్చాడు. ఆ పచ్చని ప్రకృతి ఒడిలో స్నేహితులంతా ఎంతో ఉత్సాహంగా గడిపారు. అయితే మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఒక్కసారిగా విధి వంచించింది. వరప్రసాద్‌ ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. చూస్తుండగానే నీటి ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు.

వలంటీర్ల శ్రమించినా..

కళ్లెదుటే స్నేహితుడు నీటిలో మునిగిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఆ ఇద్దరు యువకులు వేసిన కేకలు అడవిని ప్రతిధ్వనించాయి. ఆ అరుపులు విన్న స్థానిక సరియా గ్రామ వలంటీర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జలపాతం వద్దకు పరుగున వచ్చారు. వరప్రసాద్‌ను ప్రాణాలతో కాపాడుకోవాలనే తపనతో జలపాతంలో దిగి గాలింపు చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు అలుపెరగకుండా శ్రమించి వరప్రసాద్‌ను బయటకు తీశారు. కానీ, అప్పటికే ఆ యువకుడి ఊపిరి ఆగిపోయింది. ఆ నిశ్చేతన దేహాన్ని చూసి స్నేహితులు అక్కడే కుప్పకూలిపోయారు.

మృతుని తల్లిదండ్రులకు సమాచారం..

సమాచారం అందుకున్న అనంతగిరి ఎస్‌ఐ శంకరరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విశాఖలోని మృతుని తల్లిదండ్రులకు ప్రమాదసమాచారం అందించారు.

పర్యాటకులూ తస్మాత్‌ జాగ్రత్త!

ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే యువత, ఇక్కడి ప్రమాదకరమైన లోతులను అంచనా వేయలేక ప్రాణాలు కోల్పోతుండటంపై స్థానిక గిరిజనులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘సరియా జలపాతం చూడటానికి అందంగా ఉన్నా.. లోపల రాతి గుంటలు, నాచుతో చాలా ప్రమాదకరమైనది. పర్యాటకులు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఈ అందాలే ప్రాణాలు తీస్తాయి’ అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement