మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

పాడేరు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతూ, దగా డీఎస్సీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అక్రమాలకు నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులోని అంబేడ్కర్‌ సెంటర్‌లో శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి టీచర్‌ పోస్టులను అమ్ముకున్న మంత్రి లోకేష్‌ను తక్షణమే క్యాబినెట్‌ నుంచి తొలగించడంతో పాటు, ఈ స్కామ్‌పై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వసూళ్లు..

కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీని అమలు చేసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి నాగభూషణం మండిపడ్డారు. టీచర్‌ పోస్టులకు ఎంపికై న అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి.. స్పోర్ట్స్‌ కోటా పేరుతో అనర్హుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారని వారు ధ్వజమెత్తారు. ఇందులో మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందన్నారు. నకిలీ అభ్యర్థులకు టీచర్‌ ఉద్యోగాలిచ్చి ఇంత పెద్ద స్కామ్‌కు పాల్పడిన కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ నుంచి అకస్మాత్తుగా తొలగించిన మెరిట్‌ లిస్ట్‌ను వెంటనే వెబ్‌సైట్‌లో పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెడబారిక సురేష్‌కుమార్‌, అచ్యుత్‌, జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్‌కుమార్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్‌, పెదబయలు మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, అరకు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బత్తిరి చరణ్‌తేజ్‌, పలు విభాగాల నేతలు లకే సాగర్‌, పసుపులేటి యోషన్‌, వీరన్నపడాల్‌ పాల్గొన్నారు.

అక్రమాలకు పాల్పడుతూ నిరుద్యోగుల జీవితాలతో ‘కూటమి’ ఆటలు

వైఎస్సార్‌సీపీ విద్యార్థి,

యువజన విభాగం ఆగ్రహం

పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో నిరసన

మంత్రి లోకేష్‌ను పదవి నుంచి

తొలగించాలి

సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement