● వైద్య ఆరోగ్యశాఖ మంత్రిసత్యకుమార్ యాదవ్
సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన పాడేరు జిల్లా కేంద్రంలో పర్యటించి,వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా సర్వజన ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. గతంతో పోలిస్తే విశాఖ కేజీహెచ్‌కు వెళ్లే రిఫరల్ కేసుల సంఖ్య తగ్గిందని, భవిష్యత్తులో ఒక్క రోగిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేని విధంగా సౌకర్యాలు పెంచుతామన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో రూ.731 కోట్లతో 444 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజనుల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, సికిల్ సెల్ అనీమియా చికిత్స, పరిశోధనల కోసం కేజీహెచ్‌లో రూ.6 కోట్లతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పాడేరు వైద్య కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో అదనంగా 50 సీట్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.గిరిజనులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందాలన్నీ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ టి.నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, వ్యైద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, స్థానిక బీజేపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


