● విలువ రూ.85 లక్షలు
● నలుగురి అరెస్టు
గూడెంకొత్తవీధి: మండల కేంద్రంలో సుమారు రూ.85 లక్షల విలువైన 170 కిలోల గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు నుంచి గంజాయి తరలుతుందనే ముందస్తు సమాచారంతో గూడెంకొత్తవీధిలో పాతవీధి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చింతపల్లి వైపు వెళ్తున్న ఒక కారు, బైక్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని ఆపి తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన దామోదరం, రాజానగరానికి చెందిన సత్యనారాయణ, వెంకటేశ్వరరావుతో పాటు గూడెంకొత్తవీధికి చెందిన సిద్ధూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతపల్లి సీఐ సుధాకర్ నిందితులను చింతపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. దర్యాప్తులో భాగంగా గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, బైక్‌లను సీజ్ చేసినట్లు సీఐ వెల్లడించారు.


