పాడేరు : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి పాడేరు ఐటీడీఏకు వచ్చే అర్జీదారులకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు (చీఫ్ పాలసీ అధికారి) గుల్జర్ నటరాజన్, కలెక్టర్ టి. నిశాంతి అన్నారు. శుక్రవారం పీజీఆర్‌ఎస్ ముగిసిన తర్వాత అర్జీదారులకు కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు (చీఫ్ పాలసీ అధికారి) గుల్జర్ నటరాజన్ భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చే అర్జిదారులకు మధ్యాహ్నం పూట ఆకలి సమస్య తలెత్తకుండా భోజన పథకం ప్రారంభించామని తెలిపారు. దీనిని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ స్వామి నాయుడు, ఐటీడీఏ ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు.


