ఎస్.రాయవరం: మండలంలోని కొరుప్రోలు చెరువులో గెడ్డపాలెం సమీపంలో అనుమతులు అతిక్రమించి మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. ఇక్కడ మట్టి తవ్వకానికి వచ్చిన జేసీబీని అడ్డుకుని, ట్రాక్టర్లను వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ పొలాలు కప్పుకుంటామని అనుమతులు తీసుకుని ఇరిగేషన్ అధికారుల కొలతలు, మార్కింగ్ పక్కన పెట్టి నచ్చిన చోట మట్టి తవ్వకాలు చేసి చెరువు గర్భాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పొలాలు కప్పుకోవడంతోపాటు, ఇతర వ్యాపారులకు మట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. ఉపాధి కూలీలతోపాటు గ్రామస్తులు అక్కుపు జోగారావు, బద్రి నాగేశ్వరరావు, కేశవరెడ్డి కన్నయ్య, తిన్నబోతున్న అప్పారావు, నూకరాజు, కర్రి అప్పారావు, దేవ అప్పారావు, కాకర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


