● రికార్డు స్థాయిలో పాల్గొన్న భక్తులు
● 603 టికెట్ల విక్రయం
సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర హోమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో జరిగిన ఈ హోమంలో రికార్డు స్థాయిలో 505 మంది ఉభయదాతలు ప్రత్యక్షంగా, మరో 98 మంది భక్తులు పరోక్షంగా పాల్గొన్నారు. మొత్తం 603 టికెట్లను దేవస్థానం విక్రయించింది. ఉదయం నుంచి అర్చకులు శాస్త్రోక్తంగా హోమ క్రతువులు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులతో పాటు సుదర్శన పెరుమాళ్‌కు తిరువీధి నిర్వహించి అనంతరం హోమ మండపానికి తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


