ఒకవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు వ్యాపారుల కుమ్మక్కు కారణంగా జీడిపిక్కల ధరలు దారుణంగా పడిపోయాయి.తోటల నిర్వహణ,సస్యరక్షణ ఖర్చులు భారీగా పెరగడంతో జీడి రైతులు వరుసగా ఐదేళ్లుగానష్టాలనే చవిచూస్తున్నారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే క్వింటాకు రూ.500 వరకు ధర తగ్గడంతో మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఘోరంగా మారింది.ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న ఇరు పంటల రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ వరుస నష్టాల నేపథ్యంలో, ఇకపై జీడి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడమే మేలని రైతులు భావిస్తున్నారు.
రెక్కల కష్టం
కొయ్యూరు: దశాబ్దం కిందటి వరకు జీడి రైతుల పరిస్థితి చాలా బాగుండేది. వాతావరణం అనుకూలించడంతో పాటు పలాస నుంచి వచ్చే వ్యాపారులు గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం స్థానిక వ్యాపారులు ఎక్కువై, పలాస వ్యాపారులను ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పథకం ప్రకారం..
చిన్న వర్షం కురిసినా పిక్కల్లో పప్పు పాడైపోతుందనే సాకుతో వ్యాపారులు తక్షణమే ధరలు తగ్గించేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో 80 కిలోల బస్తా ధర రూ.11,500 పలుకగా, ఆ తర్వాత దాన్ని ఏకంగా రూ.9వేలకు పడేశారు. మళ్లీ సీజన్ ముగిసి, రైతుల వద్ద నిల్వలు ఉండవని తెలిసాక వ్యాపారులు ధరను రూ.11వేలకు పెంచారు. సాధారణంగా కిలో పిక్కలకు 300 గ్రాముల పప్పు వస్తేనే తమకు లాభాలు ఉంటాయని వ్యాపారులు లెక్కలు గడుతుంటారు.
కొనుగోలు చేయని జీసీసీ..
గిరిజన ప్రాంతాల్లో కాఫీని కొనుగోలు చేస్తున్న గిరిజన సహకార సంస్థ, జీడిపిక్కలను మాత్రం కొనుగోలు చేయడం లేదు. గతంలో జీసీసీ ఎండీ ఒకరు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది సాకారం కాలేదు. ఈ ప్రాంతంలో దాదాపు 35 వేల ఎకరాల్లో జీడి తోటలు విస్తరించి ఉన్నా, ఒక్కటంటే ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ కూడా లేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా నష్టాలు వస్తుండటంతో విసిగిపోయిన రైతులు జీడికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
మొక్కజొన్న రైతుల దిగులు
గత ఏడాది కిలో మొక్కజొన్నను రూ.26కు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది ప్రారంభంలో కేవలం రూ.16కే కొన్నారు. ఆ తర్వాత రూపాయి పెంచి రూ.17కు కొనుగోలు చేశారు. దీనివల్ల రైతులకు నష్టాలు మరింత పెరిగాయి. పొత్తులను, పిక్కలను ఎక్కువ రోజులు ఎండబెట్టడం వల్ల పిక్కల బరువు తగ్గిపోయి నష్టపోవాల్సి వస్తోంది. మైదాన ప్రాంతాల్లో మొక్కజొన్న కండెలను వంటచెరుకుగా ఉపయోగిస్తుండగా, ఇక్కడి రైతులు మాత్రం వాటిని వృథాగా బయట పారేస్తున్నారు.
ఒక వైపు ప్రతికూల వాతావరణం
మరోవైపు వ్యాపారుల కుమ్మక్కు
పడిపోతున్న జీడిమామిడి, మొక్కజొన్న ధరలు
పెరుగుతున్న పెట్టుబడులు..తగ్గుతున్న దిగుబడులు
సాగు గిట్టుబాటు కాక నష్టాలు
కొనుగోలు చేయని జీసీసీ,పట్టించుకోని ఐటీడీఏ
అప్పుల పాలవుతున్న అన్నదాత
దోపిడీకి చెక్ పెట్టాలి
స్థానికంగా జీడిమామిడి విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఒక హార్టికల్చర్ అధికారిని నియమించాలి. ప్రస్తుతం మూడు మండలాలకు కలిపి ఒకరే అధికారి ఉండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించింది. తమకు గిట్టుబాటు ధర దక్కాలంటే ఐటీడీఏ లేదా జీసీసీ సంస్థలు దళారులతో ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే జీడిపిక్కలను కొనుగోలు చేయాలి. స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల తమ పంటను నేరుగా అక్కడే విక్రయించుకునే వీలుంటుంది. అంతేకాకుండా, వందలాది మంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – డి.కనకరాజు, రైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం


