● నాలుగు రోజులుగా కరెంట్ కట్
● ‘మాచ్‌ఖండ్’లో బ్రేకర్ పేలిపోవడంతో సమస్య
● అల్లాడుతున్న ప్రజలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామం అంధకారంలో మగ్గుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాత్రి వేళల్లో చీకటి కారణంగా పాములు, ఇతర విషకీటకాలు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 11 కేవీ బ్రేకర్ పేలిపోవడంతో ఈ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నప్పటికీ, తిరిగి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. వేసవి కాలం కావడంతో విద్యుత్ లేక ఫ్యాన్లు, కూలర్లు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు తాళలేక వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గ్రామంలోని చిన్న చిన్న వ్యాపారులు కరెంట్ లేక నష్టపోతున్నారు. ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు కుళ్లిపోతున్నాయి. సెల్‌ఫోన్లలో చార్జింగ్ అయిపోవడంతో, ఫోన్లు ఆన్ చేసుకోవడానికి జోలాపుట్టు ప్రజలు సరిహద్దు దాటి ఒడిశా రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.విద్యుత్ లేక మోటార్లు నడవకపోవడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రం నుంచి జోలాపుట్టు ప్రాజెక్టు ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, నాలుగు రోజులుగా చీకట్లోనే ఉంచుతూ ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ విద్యుత్ సమస్యపై విసిగిపోయిన జోలాపుట్టు గ్రామస్తులు గురువారం వాహనాలలో మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి తరలివెళ్లారు. అక్కడ ప్రాజెక్టు ఎస్‌ఈ సీహెచ్. అప్పాజీని కలిసి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి బ్రేకర్లు పూర్తిగా పాడైపోయాయని, ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఈ మరమ్మతులు పూర్తి కావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, అంతవరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం సాధ్యం కాకపోవచ్చని ఆయన తేల్చి చెప్పారు.
కలెక్టర్ స్పందించాలని వేడుకోలు
మాచ్‌ఖండ్ నుంచి కరెంట్ రావడం ఆలస్యమయ్యేలా ఉన్నందున, కలెక్టర్ తక్షణమే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని జోలాపుట్టు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయంగా ముంచంగిపుట్టు మండలం నుంచి జోలాపుట్టు గ్రామానికి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా లైన్ ఇచ్చేలా చర్యలు తీసుకుని, తమను అంధకారం నుంచి కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


