ఆకతాయిల బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

ఆకతాయిల బరితెగింపు

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

మన్యం ఘాట్‌ రోడ్డు ప్రయాణంలో ప్రమాదాల నివారణకు రక్షణ కవచాల్లా నిలిచే మలుపుల అద్దాలు (కాన్వెక్స్‌ మిర్రర్లు) ఇప్పుడు ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. జాతీయ రహదారి 516ఈ పరిధిలోని రంపుల ఘాట్‌ రోడ్డులో కొందరు దుండగులు అద్దాలను పగులగొడుతూ, మరికొన్ని చోట్ల మాయం చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కీలకమైన మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో, వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది.

ఘాట్‌ రోడ్డులో ప్రమాద నివారణఅద్దాల ధ్వంసం

భయాందోళనలో ప్రయాణికులు

గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516ఈ పరిధిలోని రంపుల ఘాట్‌ రోడ్డులో ఆకతాయిలు బరితెగిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసం అధికారులు ప్రమాదకరమైన యూ–టర్న్‌ (మలుపుల) వద్ద ఏర్పాటు చేసిన పుటాకార (కాన్వెక్స్‌) అద్దాలను కొందరు దుండగులు పగులగొడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు అద్దాలు లేకుండా మాయం చేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రమాదాలకు దారితీస్తున్న అద్దాల మాయం

రంపుల ఘాట్‌ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఘాట్‌ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. ఘాట్‌ రోడ్డు ప్రయాణంలో ఈ అద్దాలు ఎంతో కీలకంగా మారాయి. అయితే, ప్రస్తుతం కీలకమైన మలుపుల వద్ద అద్దాలు పగిలిపోవడం, కొన్నిచోట్ల పూర్తిగా మాయమవడంతో ప్రయాణికులు మలుపుల వద్ద ఎటునుంచి ఏ వాహనం వస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రయాణికుల డిమాండ్లు: జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలను పోలీసులు గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే జాతీయ రహదారి అధికారులు స్పందించి, మాయమైన చోట్ల తక్షణమే కొత్త అద్దాలను ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement