ఉపాధి కూలీలకు శాపం ‘ముఖ హాజరు’ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు శాపం ‘ముఖ హాజరు’

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

ముంచంగిపుట్టు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టిన ’‘ముఖ హాజరు’విధానంతో వేతనదారులు పడరాని పాట్లు పడుతున్నారని, ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర డిమాండ్‌ చేశారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ పరిధిలో గల చోటముఖిపుట్టు, జంగంసరియా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎదుట తమ కష్టాలను చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్‌ యాప్‌ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రతిరోజూ గంటల తరబడి పని ప్రదేశంలోనే వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల కష్టపడి పనిచేసినా కనీస కూలి రావడం లేదని వాపోయారు. గ్రామాల్లో వేతనదారుల ఇబ్బందులను స్వయంగా చూసిన సుభద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో తెచ్చిన ఈ కొత్త మార్పులు కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం ముఖ హాజరు నమోదు చేయడానికే సమయం సరిపోతోందని, ఫలితంగా రెండు మూడు గంటల పని సమయం యాప్‌ సమస్యల వల్లే వృథా అవుతోందని మండిపడ్డారు. తీవ్రమైన ఎండల్లో కూలీలు పనులు చేస్తున్నప్పటికీ, పని ప్రదేశాల్లో కనీసం తాగునీరు, మజ్జిగ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు. తక్షణమే ఈ ఫేస్‌ యాప్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే హాజరు నమోదు చేస్తూ ఉపాధి పనులు కల్పించాలని, వేతనదారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కూలీల కష్టాలను చూసి చలించిన జెడ్పీ చైర్‌పర్సన్‌, అనంతరం ఉపాధి వేతనదారులకు ఉచితంగా గ్లూకోజ్‌ డ్రింక్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, అరకు నియోజకవర్గం ప్రచార కమిటీ అధ్యక్షులు వి.కొండలరావు, ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచులు నరసింగరావు, రమేష్‌, పార్టీ మండల నాయకులు రాంప్రసాద్‌, అర్జున్‌, జె.వి.వి.ఎన్‌.మూర్తి, తిరుపతిరావు, ప్రసాద్‌, అధిక సంఖ్యలో ఉపాధి హామీ వేతనదారులు పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌

జల్లిపల్లి సుభద్ర ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement