అరకులోయ (సాక్షి, పాడేరు): సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడంతో పాటు, బాధ్యతగా కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎన్‌సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్‌కుమార్ పిలుపునిచ్చారు. అరకులోయ ప్రాంతంలో జరుగుతున్న ట్రెక్కింగ్ క్యాంపునకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన ఎన్‌సీసీ విద్యార్థులకు ‘గ్రీన్ కై ్లమేట్ టీం’ ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. యువత విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అటవీశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణ పరిరక్షణకు మరింత కృషి చేయాలని కోరారు. మహావృక్షాలు మన జీవావరణ వ్యవస్థకు పునాదులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అడవులు పుడమి తల్లికి ఊపిరితిత్తులు..
సబ్ డీఎఫ్‌వో శ్రీవాణి
సబ్ డీఎఫ్‌వో కడలి శ్రీవాణి మాట్లాడుతూ.. అడవులు పుడమి తల్లికి ఊపిరితిత్తుల లాంటివని, వాటిని సంరక్షించుకోవాల్సిన కనీస బాధ్యత మానవాళిదేనని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, జీవవైవిధ్యాన్ని కాపాడుకున్నప్పుడే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్‌సీసీ ప్రతినిధి రాజేంద్రన్, సీనియర్ అసిస్టెంట్ గోవిందరావు, సామాజిక వనాల ప్రతినిధి పి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లెఫ్ట్‌నెంట్ కల్నల్ నీరజ్‌కుమార్


