3 ప్రాంతాల్లో ఐదో సీజన్ నిర్వహణ
బరిలో 7 ఫ్రాంచైజీలు
తొలి 11 మ్యాచ్‌లు విశాఖలో..
కడపలో 9 మ్యాచ్‌లు, మంగళగిరిలో ఫైనల్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదవ సీజన్ సందడి ప్రారంభం కానుంది. వచ్చే నెల జూన్ 9వ తేదీ నుంచి ఈ టోర్నీ జరగనుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఏపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం ఏడు ఫ్రాంచైజీ జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తలపడనున్నాయి.
విశాఖ వేదికగా తొలి 11 మ్యాచ్‌లు
విశాఖలోని వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొదటి విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఇక్కడ మొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూన్ 9న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌తో కాకినాడ కింగ్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
కడప, మంగళగిరిలలో తదుపరి సమరం
విశాఖలో ముగిసిన తర్వాత టోర్నీ కడపకు మారుతుంది. అక్కడ జూన్ 17 నుంచి 21 వరకు మొత్తం 9 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత మంగళగిరి స్టేడియంలో జూన్ 24 నుంచి 27 వరకు చివరి 8 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మంగళగిరి వేదికగానే ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్‌లతో పాటు, జూన్ 30న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించి టోర్నీకి తెరదించుతారు.
లీగ్ షెడ్యూల్
జూన్ 10 – తుంగభద్ర వారియర్స్ వర్సెస్ క్యాపిటల్ అమరావతి రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్ వర్సెస్ భీమవరం బుల్స్
జూన్ 11 – సింహాద్రి వైజాగ్ లయన్స్ వర్సెస్ అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ
జూన్ 12 – కాకినాడ కింగ్స్ వర్సెస్ విజయవాడ సన్‌షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ వర్సెస్ తుంగభద్ర వారియర్స్
జూన్ 13 – భీమవరం బుల్స్ వర్సెస్ వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్
జూన్ 14 – అమరావతి రాయల్స్ వర్సెస్ భీమవరం బుల్స్, విజయవాడ సన్‌షైనర్స్ వర్సెస్ వైజాగ్ లయన్స్.


