దేవరాపల్లి: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు తులసీమణి, మాధురి రైతులకు సూచించారు. మండలంలోని చిననందిపల్లి, శివరామ చేనులపాలెం, మారేపల్లి గ్రామాల్లో బుధవారం స్థానిక ఏవో ఎల్.వై. కాంతమ్మతో కలిసి వారు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏపీసీఎన్‌ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్) పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను సందర్శించారు. అధిక ఎరువుల వాడకంతో కలిగే నష్టాలను రైతులకు సమగ్రంగా వివరించారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే జనుము, జీలుగు, పల్లి పెసర తదితర పచ్చిరొట్ట విత్తనాలను ఎకరానికి 10 కేజీలు వేసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా అందిస్తున్న పీఎండీఎస్ కిట్స్ 12 నుంచి 15 కేజీలు ఎకరా పొలంలో వేసుకోవడం ద్వారా 35 నుంచి 45 రోజులకు 8 టన్నుల మేర ఎరువు భూమికి చేరుతుందన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతతో భూమి నిస్సారవంతం అవుతుందన్నారు. భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట ఎరువులు, పీఎండీఎస్ విత్తనాలను వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.


