పూజిత మృతిపై సమగ్ర విచారణ
సాక్షి,పాడేరు: జిల్లాలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉందని, ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసేవలు పొందాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
బాధ్యులపై క్రిమినల్ చర్యలు
పెదబయలు బాలికల ఆశ్రమ పాఠశాల–2లో 9 వతరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని కొర్రా పూజిత సంక్రాంతి సెలవులకు స్వగ్రామమైన కౌరుపల్లికి వెళ్లి అనారోగ్య సమస్యలతో మృతిచెందడం బాధాకరమని పీవో అన్నారు. ఆమె మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ యంత్రాంగంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికారికంగా వైద్యం చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు..
గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులు అనారోగ్య సమస్యలకు గురైతే సకాలంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వైద్యసేవలు కల్పించే బాధ్యత ఉందని పీవో అన్నారు. పీహెచ్‌సీల్లో ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన ఉన్నత వైద్యసేవలకు జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రిలో 24గంటల పాటు నాణ్యమైన వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు.
నాటువైద్యానికి దూరంగా ఉండాలి
కొన్ని గ్రామీణ ప్రాంతాలు, సంతల్లో అనుభవం లేని వైద్యులు, అనుమతులు లేని చికిత్స కేంద్రాలను ఆశ్రయించడంతో మరణాలు ఏర్పడుతున్నాయని పీవో వెల్లడించారు. విద్యార్థుఽల తల్లిదండ్రులు కూడా నాటు వైద్యం,ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించే పరిస్థితికి దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్య సమస్యలను ధ్రువీకరించకుండా మందులు వినియోగించడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందన్నారు.
కాల్‌సెంటర్‌ను సంప్రదించండి
గిరిజన విద్యాలయాలతో పాటు గ్రామాల్లోని విద్యార్థులు, ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రులకు తరలించేందుకు 108తో పాటు ఆస్పత్రులలో అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయని పీవో తెలిపారు.అత్యవసర సమయంలో అంబులెన్స్ సౌకర్యం పొందేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాల్ సెంటర్‌లోని 6303921374ను సంప్రదించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు
పొందాలి
సంతల్లో అనధికార వైద్యంపై
స్పెషల్ డ్రైవ్
ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవోతిరుమణి శ్రీపూజ


