మూగజీవాలకు ప్రాణగండం
సీలేరు: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరు పశుపోషణ. అయితే, గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల సరఫరా నిలిచిపోవడంతో మూగజీవాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
● సీజనల్ వ్యాధులు ప్రబలే శీతాకాలం వచ్చేసినా, ఆసుపత్రుల్లో కనీస మందులు అందుబాటులో లేవు. హైడోస్ యాంటీబయాటిక్స్, సెఫలోస్పోరిన్, లివర్ టానిక్, మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, జ్వరానికి సంబంధించిన మాత్రలు కూడా నిండుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మందులు లేకపోవడంతో, గిరిజన రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
● ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాంతీయ పశు వైద్యశాలకు రూ.1.25 లక్షలు, డిస్పెన్సరీలకు రూ.75 వేలు, గ్రామీణ వైద్యశాలలకు రూ.45 వేల చొప్పున బడ్జెట్ ఉంది. అయితే, పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లకు తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల అధికారులు నాణ్యమైన మందులు ఇండెంట్ పెట్టలేకపోతున్నారు. తక్కువ ధరలో వచ్చే సాధారణ మందులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.
● సకాలంలో టీకాలు, మందులు అందక మూగజీవాలు మృతి చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెంపకందారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మందుల కొరతను తీర్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
● గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మూడు గ్రామీణ పశువైద్యశాలలు, ఆరు వెటర్నరీ డిస్పెన్సరీలు, ఒక ప్రాంతీయ పశువైద్యశాల ఉన్నాయి. జీవాలు విషయానికొస్తే ఆవులు, గేదెలు 1,08,866, గొర్రెలు, మేకలు 1,02,701, కోళ్లు 2,01,644 ఉన్నాయి.
మందులు వచ్చాయి
గతంలో పెట్టిన ఇండెంట్ ప్రకారం ఇప్పటికే జిల్లా పశు వైద్య కార్యాలయానికి మందులు వచ్చాయి. రేపటి నుంచి మండల కేంద్ర వెటర్నరీ ఆ సుపత్రులకు సరఫరా చేసి అక్కడ నుంచి ప్రతి ఆసుపత్రికి పంపించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. వ్యాక్సిన్లు, ఇతర మందులు కూడా వచ్చాయి.
– డాక్టర్ వి.జయరాజ్,
డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్, పాడేరు
పశువైద్యశాలలకు తొమ్మిది నెలలుగా నిలిచిన మందుల సరఫరా
సరైన వైద్యం అందక ఇబ్బందులు
పడుతున్న జీవాల పెంపకందారులు
పట్టించుకోని ప్రభుత్వం


