వీఆర్‌వోల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: వీఆర్‌వోల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపకుడు ఈర్లె శ్రీరామూర్తి డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగరం వద్ద శంకరన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా వీఆర్‌వోల కార్యవర్గ సమావేశంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. వీఆర్‌వోలను సింగల్ అడ్మిషన్ పద్ధతిలోకి తీసుకొచ్చే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలనలో వీఆర్‌వో వ్యవస్థను కాపాడారని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో రీ సర్వే చేస్తున్న సమయంలో వీఆర్‌వోకు ఒక్క రూపాయి కూడా అందజేయలేదని, వీఆర్‌వోలు సొంత సొమ్ముతో గ్రామాల్లో రీసర్వేల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రీ సర్వేల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తోందని, గత ప్రభుత్వంలో ఇచ్చిన పాసుపుస్తకాలకు రాజముద్ర వేసి ఇస్తోందన్నారు. వీఆర్‌వో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌వోలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5న విజయవాడలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాజన సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.40వేల కోట్లు బకాయిపడిందని, దశల వారీగా ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఆయన కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చడంతో ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన నాలుగు డీఏలను సంక్రాంతిలోగా ఇవ్వాలని, కొత్త పీఆర్సీని అమలు చేసే వరకూ ఐఆర్‌ను ప్రకటించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అనుపమ, జిల్లా అధ్యక్షుడు ఎ.శశిధర్, అసోసియేట్ అధ్యక్షుడు చిన్నంనాయుడు, ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


