30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి
అనకాపల్లి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించి, అమలు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంపాల వెంకటరమణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ గడువు ముగిసి ఇప్పటికే రెండు సంవత్సరాల ఆరు నెలల కాలం పూర్తి అయ్యినందున, జూలై 2023 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన పీఆర్‌సీ అమలు చేయవలసి ఉన్నందున, ఉద్యోగులు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా, సంక్రాంతి కానుకగా తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి మద్యంతర భృతిని ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్నికల హామీతో పాటు ఇటీవల ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు మద్యంతర భృతిపై స్పష్టమైన హామీ ఇచ్చినందున, హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన నాలుగు ఐచ్చిక సెలవులు వ్యక్తిగతంగా కాకుండా గతంలో లాగా పాఠశాల మొత్తానికి ఇచ్చే విధంగా అధికారులు పునరాలోచించాలని, సీఆర్‌ఎంటీలు వారి సమస్యలపై ఉద్యమ కార్యాచరణ దిశగా వెళుతున్నందున ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. 98 ఎంటీఎస్ టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 పెంచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎన్‌టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సింగంపల్లి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శులు పెనుమత్స కృష్ణ్ణంరాజు, వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్, మహిళా అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ఆర్థిక కార్యదర్శి నూకేష్ పాల్గొన్నారు.


