రోడ్డు నిర్మించాలని పొర్లుదండాలతో నిరసన
రోలుగుంట: బీఎన్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా జిల్లా కార్యవర్గం సభ్యుడు కె.గోవింద, నాయకులు ఆదివారం భోగాపురం కూడలి వద్ద పొర్లు దండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ బీఎన్ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు పాంగి చంద్రయ్య, పాడి బన్నియ్య, పాంగి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


