మోసం! | - | Sakshi
Sakshi News home page

మోసం!

Jan 3 2026 7:04 AM | Updated on Jan 3 2026 7:04 AM

మోసం!

మోసం!

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణాలపై ఇచ్చిన కీలక హామీ అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఇళ్లకు అదనంగా రూ. లక్ష ప్రోత్సాహకం అందిస్తామని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది గిరిజనులు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సొంత నిధులు వెచ్చించి, అప్పులు చేసి పునాదులు, గోడల వరకు నిర్మించిన లబ్ధిదారులు.. ఇప్పుడు ప్రభుత్వ సాయం అందక పైకప్పులు వేయలేక ఇళ్లను మధ్యలోనే వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో గిరిజన గూడాల్లో అసహనం వ్యక్తమవుతోంది.
లక్షణమైన

సాక్షి, పాడేరు: చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నిలువునా వంచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన గృహ నిర్మాణాలకు అదనంగా రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా సాయం అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

అప్పుల ఊబిలో..

కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు, పీఎం గ్రామీణ్‌ కింద రూ.1.80 లక్షలు అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా శ్లాబ్‌తో కూడిన పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఇస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. తీరా నిర్మాణాలు కీలక దశకు చేరుకున్నాక రాష్ట్ర సాయం అందకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

● పీఎం జన్‌మన్‌ గృహాలు జిల్లాలో (రంపచోడవరంతో కలిపి) 36,223 మంజూరయ్యాయి. ఇవన్నీ పీవీటీజీ గిరిజనులు నిర్మించుకుంటున్నారు. వివిధ తెగల గిరిజనులకు సంబంధించి పీఎం గ్రామీణ్‌ పథకంలో 17,111 ఇళ్లు మంజూరయ్యాయి. నిధుల కొరత కారణంగా వీటిలో పది వేల ఇళ్లు శ్లాబ్‌ దశలోనే ఆగిపోయాయి.

తప్పని ఎదురుచూపులు

అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సుమారు 4,891 మంది గిరిజనులు ఇళ్లు పూర్తి చేసుకుని గతేడాది నవంబర్‌ 12న గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఆర్భాటంగా పాల్గొన్న కూటమి నేతలు, అధికారులు సాయం అందిస్తామని నమ్మబలికారు. గృహ ప్రవేశాలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం, తక్షణమే స్పందించి గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు.

బురుగుచట్టులో పూర్తికాని పీఎం జన్‌మన్‌ఇంటి వద్ద గెమ్మెలి చిలకమ్మ

ప్రభుత్వానికి నివేదిక

పీఎం జన్‌మన్‌, పీఎం గ్రామీణ్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారుల సమగ్ర వివరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. నిధులు విడుదల అవ్వగానే ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రోత్సాహక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి. – బి.బాబునాయక్‌,

ఇన్‌చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ

రూ.లక్ష సాయం అందలేదు

పీఎం జన్‌మన్‌ పథకంలో మంజూరైన ఇల్లుకు సంబంధించి నిర్మాణాన్ని అష్టకష్టాలు పడి పూర్తి చేశా. కేంద్ర ప్రభుత్వం రూ.2.39 లక్షల బిల్లు మంజూరు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రూ.లక్ష సాయం అందలేదు.మా గ్రామంలో కలెక్టరే స్వయంగా వచ్చి గృహ ప్రవేశాలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం.

– మర్రి లక్ష్మి, సప్పిపుట్టు,

వంతాడపల్లి పంచాయతీ, పాడేరు మండలం

ఇంటి పని ఆగిపోయింది

గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చే రూ.2.39 లక్షలు చాలడం లేదు. దాచుకున్న నగదుతో పాటు రెండు విడతలుగా అందిన రూ.1.60 లక్షలతో శ్లాబ్‌ వరకు నిర్మాణం పూర్తి చేశా. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం నిలిచింది. నిర్మాణం పూర్తయితేనే పీఎం జన్‌మన్‌ పథకం ఫైనల్‌ బిల్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

– మర్రి లింగేష్‌, జీడిపగడ,

వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం

మోసం!1
1/3

మోసం!

మోసం!2
2/3

మోసం!

మోసం!3
3/3

మోసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement