ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● పాడేరులో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీ
● రాష్ట్రం నలుమూలల నుంచి 72 జట్ల రాక
పాడేరు: అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం గొప్ప విషయమని, టోర్నీ నిర్వహణతో గిరిజన ప్రాంత ప్రతిష్ట మరింత పెరుగుతుందని కలెక్టర్ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మే 11, 12, 13 తేదీల్లో జరగనున్న పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 36వ రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీని బుధవారం వారు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి జాతీయ జెండాను చేతబట్టి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 72 క్రికెట్ జట్లు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1.20 లక్షలు, షీల్డ్, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, షీల్డ్‌తోపాటు వ్యక్తిగత బహుమతులు అందజేస్తామని నిర్వహకులు వివరించారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ఖ్యాతిని పెంచేలా టోర్నీ నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని, స్నేహపూర్వక వాతావరణంలో టోర్నీని విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, దూసూరి సన్యాసిరావు, కుంతూరు నర్శింహమూర్తి, లకే రామకృష్ణపాత్రుడు, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, గబ్బాడ చిట్టిబాబు, కుర్రబోయిన సన్నిబాబు, సోమెలి లక్ష్మణరావు, గబ్బాడ చిట్టిబాబు, టోర్నీ నిర్వాహకులు సీదరి రాంబాబు, కొంటా దుర్గారావు, బాకూరు ఉమామహేష్, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.


