ఆనందోత్సాహాలతో ఆర్చిబిషప్ ప్రతిష్టాపన
డాబాగార్డెన్స్: వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు.. వందలాది నన్‌లు, ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారుల సమక్షంలో.. పోప్ ప్రతినిధి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి నేతృత్వంలో.. ఆధ్యాత్మిక పండగలా సాగిన వేడుకలో మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల విశాఖ ఆర్చ్‌బిషప్(అగ్రపీఠాధిపతి)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వాల్తేరు ఆర్‌ఎస్ సమీపానున్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వరకూ భారీ ఊరేగింపు సాగింది. తన తొలి ప్రసంగంలో ఉడుమల బాల మాట్లాడుతూ తన జన్మభూమి వరంగల్ అయితే.. పుణ్యభూమి విశాఖ అని కొనియాడారు.
పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధి, భారత్– నేపాల్ అపోస్టోలిక్ నున్సియో(అంబాసిడర్) మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌కు కొత్త చీఫ్ పాస్టర్‌ను బహుమతిగా ఇచ్చినందుకు దేవునికి కతజ్ఞతలు తెలిపారు. బాల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో లక్షకు పైగా క్యాథలిక్ ప్రజలు ఉన్నారని, ప్రీస్టులు, నన్స్‌తో కూడిన బలమైన ఉనికి ఉందన్నారు. ఆర్చ్‌డియోసెస్ ఎదుర్కొంటున్న సవాళ్లపై గిరెల్లి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, వలసదారుల దీనస్థితి, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. 2015 నుంచి 2023 వరకు సీసీబీఐ కమిషన్ ఫర్ సెమినేరియన్స్, మతాధికారిగా బాల బాధ్యతలు, చైర్మన్‌గా ఆయన అనుభవాన్ని హైలైట్ చేశారు.
ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు ఆర్చ్‌డయోసిస్‌కు చేసిన సేవలకు అపోస్టోలిక్ నన్సియో, అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పాస్టోరల్ నాయకత్వానికి చేసిన సేవలకు బిషప్ జయరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సీనియర్ చర్చి నాయకులు హాజరయ్యారు, వీరిలో ఆర్చ్‌బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు, రాయ్‌పూర్ ఆర్చ్‌బిషప్ విక్టర్ హెన్రీ ఠాకూర్, సీసీబీఐ వైస్ ప్రెసిడెంట్, బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో, ఆగ్రా ఆర్చ్‌బిషప్ రాఫీ మంజలీ, ఇతర ఆర్చ్‌బిషప్‌లు, బిషప్‌లు పాల్గొన్నారు.
విశాఖ ఆర్చ్‌బిషప్‌గా ఉడుమల బాల
ఆనందోత్సాహాలతో ఆర్చిబిషప్ ప్రతిష్టాపన


