టాస్క్‌ఫోర్స్ టీంలతో మలేరియా నివారణ చర్యలు
చింతూరు: గ్రామస్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణలో భాగంగా ఈనెల 15 నుంచి ఇళ్లలో దోమల మందు పిచికారీ చేసేందుకు చేపట్టే ప్రణాళికా కార్యక్రమం గురించి ఆయన చర్చించారు. అనంతరం పీవో మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ టీంలకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాలని ఆదేశించారు. దోమలమందు పిచికారీ చేసేందుకు వర్కర్లను నియమించి వారికి తగిన శిక్షణనివ్వాలని, పిచికారీ నిర్వహించే గ్రామాల ప్రజలకు మూడు రోజులు ముందుగానే తెలియచేయాలని ఆయన ఆదేశించారు. పాజిటివ్ కేసులకు చికిత్స జరుగుతున్న తీరును తెలుసుకొని ఇక నుంచి సంబంధిత పీహెచ్‌సీ సూపర్‌వైజర్ బాధ్యత తీసుకుని చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని పీవో ఆదేశించారు. మలేరియాతోపాటు మిగతా రోగాలపై కూడా ప్రతి రోజూ ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరాజు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి పాల్గొన్నారు.
15 నుంచి ఇళ్లలో దోమలమందు పిచికారీ
ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ ఆదేశం


